కాకి ఎత్తుకపాయే

వీధి అరుగు మీది 
ముచ్చట్లని 
కాకి ఎత్తుకపాయే 
వేపచెట్టు నీడన 
నులక మంచం 
కాగితం బొమ్మాయే 
గిలకబాయి వద్ద
మట్టి కుండలు 
శిథిలమయిపాయే 
మర్రిచెట్టు కాడ 
కుశాలుగా నవ్వుకునే
నలుగురు మనుషుల జాడ
కానరాక పాయే 
పిండిగిర్ని వద్ద 
కడుపారా పలకరించుకునే 
తల్లులు మాటలు రాలిపాయే 
నాలుగు చీరలై 
పరుచుకున్న బొంత 
కథగా మారిపాయే  
తీరిక వేళ చేరి 
ఆడుకునే పులిజూదం 
మృత్యువాత పడే 
           - వెంకటేష్