విజ్ఞాన్స్‌లో వైభవంగా ఉట్టి ఉత్సవ వేడుకలు

విజ్ఞాన్స్‌లో వైభవంగా ఉట్టి ఉత్సవ వేడుకలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను పురస్కరించుకుని ఉట్టి ఉత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఉట్టి ఉత్సవం ఐక్యతకు, సమష్టితత్వానికి ప్రతీక అని  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఉట్టి ఉత్సవంలో పాల్గొని ఉట్టిని పగులగొట్టారు. ఎంతో ఎత్తున ఉండే ఉట్టిని పగులగొట్టడం ద్వారా సమష్టి కృషితో ఏదైనా సాధించొచ్చనే విషయాన్ని తెలుపుతుందన్నారు. జీవితంలో ప్రతి విజయానికి సమష్టి కృషి ఎంతో అవసరమని వెల్లడించారు. ఇప్పటి నుంచే విద్యార్థులు నలుగురితో కలిసి మెలిసి పనిచేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. కృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఉట్టి ఉత్సవం ఆద్యంతం ఉల్లాసాన్ని నింపింది. దాదాపు 50 జట్లు ఈ ఉట్టి ఉత్సవంలో పాల్గొన్నాయి. ఒక్కో జట్టులో 12 మంది చొప్పున ప్రాతినిధ్యం వహించి ఉట్టిని కొట్టే వేడుకల్లో పాలుపంచుకున్నారు. 12 మంది పిరమిడ్‌లా ఏర్పడి ఉట్టిని పగులగొట్టిన వైనం అబ్బురపరిచింది. యూనివర్సిటీ ప్రాంగణమంతా పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.