విలువలు నేర్పడం ఉపాధ్యాయుడి బాధ్యత

విలువలు నేర్పడం ఉపాధ్యాయుడి బాధ్యత

  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:

  విజ్ఞాన్‌ యూనివర్సిటీలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

ఉపాధ్యాయులు విద్యార్థులకు చదువుతో పాటు విలువలు కూడా నేర్పించాల్సిన బాధ్యత ఉందని విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం, విజ్ఞాన్స్‌ జూనియర్‌ కళాశాలలో మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా వారి సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాలని సూచించారు. విద్యార్థులతో ఉపాధ్యాయులకు మమతానుబంధం ఉండాలని తెలిపారు. ఏ రంగంలోనూ లేని, ఉపాధ్యాయులకు మాత్రమే ఉన్న అతి గొప్ప అవకాశం సాధ్యమైనంతమంది శిష్యులను పొందడమేనని వెల్లడించారు. విజ్ఞాన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ మాట్లాడుతూ దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుడి చేతుల్లో ఉందని, భావి పౌరులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అతడిదేనని చెప్పారు. రాధాకృష్ణన్‌ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులంతా జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విజ్ఞాన్స్‌ జూనియర్‌ కళాశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌ మాట్లాడుతూ సమాజంలోనే అత్యున్నత వృత్తి ఉపాధ్యాయ వృత్తేనని పేర్కొన్నారు.  ఉపాధ్యాయుడి నుంచి రాష్ట్రపతి వరకు ఆయన ఎదిగిన తీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారందరికీ ఆదర్శనీయమన్నారు. కొంత మంది విద్యార్థులు చదువులో వెనుకబడినా సరే ఎందరో ప్రపంచవిజేతలుగా నిలిచారని, మేధావులుగా విలసిల్లారని, ఎవరూ చిన్నారులపై చదువు విషయంలో ఒత్తిడి చేయరాదని సూచించారు. అనంతరం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పలు క్రీడా కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన అధ్యాపక సిబ్బందికి బహుమతులను అందజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, ప్రిన్సిపల్‌ జే.మోహనరావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.