విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మీ వ్రత పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్‌ యూనివర్సిటీ సిబ్బంది, పలువురు విద్యార్థులు సామూహిక వ్రత పూజలు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ అష్టలక్షు్మలలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉందని, మిగిలిన లక్ష్మీ పూజలకంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టమని, విశేష ఫలితాలు దక్కుతాయని తెలిపారు. విదేశీయులు సైతం ప్రస్తుతం మన సంప్రదాయాలను ఆచరిస్తున్నారని తెలిపారు. మన పండుగలు, వాటిని జరుపుకునే తీరు చూసి ప్రపంచం అబ్బురపడుతోందన్నారు. ఎప్పటికీ మన సంస్కృతిని యువత మరిచిపోరాదనే ఉద్దేశంతో ఇలా అన్ని పండుగలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలుత విఘ్నేశ్వర పూజ అనంతరం వరలక్ష్మీ వ్రతం కొనసాగింది. కళాశాల విద్యార్థినులు ప్రత్యేక పూజల్లో ఆసక్తిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.