తెనాలిలో వీణా అవార్డ్స్- 2023 పరిషత్ నాటక - నాటిక పోటీలు

తెనాలిలో వీణా అవార్డ్స్- 2023 పరిషత్ నాటక - నాటిక పోటీలు

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెనాలి : 19-10-2023 : కళలకాణాచి - తెనాలి , వేదగంగోత్రి ఫోండేషన్ - విజయవాడ వారి సంయుక్త నిర్వహణలో అక్టోబర్ 20 వ తేదీ శుక్రవారం నుండి 24 వ తేదీ మంగళవారం వరకు తృతీయ జాతీయస్థాయి వీణా అవార్డ్స్ -2023 పద్యనాటక , సాంఘిక నాటిక పోటీలు జరుపుతున్నట్లు కళల కాణాచి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు , సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా తెలియజేశారు . స్థానిక గాంధీనగర్లోని సి.పి.ఐ. కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం ఆయన మాట్లాడుతూ తెనాలిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ పరిషత్ పోటీలకు అనూహ్యమైన స్పందన వచ్చిందన్నారు . ఎంట్రీలో 35 పద్య నాటకాలు , 40 సాంఘిక నాటికలు రాగా ఒక్కో విభాగానికి ఏడు చొప్పున పోటీ ప్రదర్శనకు ఎంపికచేశాము . మరో నాలుగు సాంఘిక నాటకాలను పోటీతో సంబంధం లేకుండా ప్రదర్శించడానికి అనుమతిచ్చాము . గతంలో ఏప్రిల్లో పద్య నాటకాలు , అక్టోబర్లో సాంఘిక నాటికల పోటీలు జరిపాము . అయితే కళాకారులు అభ్యర్థనమేరకు దసరా సందర్భంగా రెండు విభాగాల నాటక , నాటికలను కన్నులపండుగగా ఒకే వేదికపై నిర్వహించాలని తలపెట్టాము . 20 వ తేదీ వీణా అవార్డ్స్ ప్రారంభోత్సవ సభలో ఏ.ఆర్ . కృష్ణ జాతీయ రంగస్థల పురస్కారాన్ని హైదరాబాద్కు చెందిన ప్రఖ్యాత రంగస్థల నటుడు , దర్శకుడు నెమలికంటి తారక రామారావుకు ప్రదానం చేస్తారు . 24 వ తేదీ ముగింపు రోజున బుఱ్ఱా సుబ్రహ్మణ్యశాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని నెల్లూరుకు చెందిన ప్రముఖ పౌరాణిక నటుడు , గుణనిర్ణేత పొన్నాల రామసుబ్బారెడ్డికి ప్రదానం చేస్తున్నాము . ఈ కార్యక్రమాలలో ప్రముఖ సినీ హీరో అశోక్ గల్లా , హీరోయిన్ కుమారి మానస వారణాసి , సినీ దర్శకుడు వంశీ , సినీ నటులు ప్రదీప్ , విస్సు తదితరులు పాల్గొంటున్నట్లు సాయిమాధవ్ తెలిపారు . విలేకర్ల సమావేశంలో కళల కాణాచి ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగా , కోశాధికారి శ్రీమతి దేవరపల్లి భవాని , వ్యవస్థాపక కార్యదర్శి షేక్ జానిబాషా , సహాయ కార్యదర్శులు ఐనాల మల్లేశ్వరరావు , కొండముది రమేష్ , పీఆర్వో షేక్ అబ్దుల్ హకీం జాని , పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొమ్మదేవర వెంకటేశ్వరరావు , వెనిగళ్ళ నారాయణ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు .