పరిశోధకులు వినూత్న కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలి

పరిశోధకులు వినూత్న కార్యక్రమాల్లో నిమగ్నమవ్వాలి
హైదరాబాద్‌లోని ఐఐసీటీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కే.భానుప్రకాష్‌

  విజ్ఞాన్స్‌లో ఘనంగా ముగిసిన జాతీయస్థాయి వర్క్‌షాప్‌

దేశ సమగ్ర ప్రగతికి దోహదపడే వినూత్న కార్యక్రమాలలో పరిశోధకులు నిమగ్నమవ్వాలని హైదరాబాద్‌లోని ఐఐసీటీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కే.భానుప్రకాష్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ ఆధ్వర్యంలోని కెమిస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘ హ్యాండ్స్‌ ఆన్‌ ట్రైనింగ్‌ యూజింగ్‌ ఇన్‌–సిలికో టూల్స్‌ ఫర్‌ కెమికల్‌/ బయోలాజికల్‌ అప్లికేషన్స్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి వర్క్‌షాప్‌ ఘనంగా ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని ఐఐసీటీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ కే.భానుప్రకాష్‌ వివిధ రకాల రసాయన మూలకాలు, వాటి స్వరూపాలు, ప్రయోజనాలు, సొసైటీ ప్రగతికి దోహదపడ్డ అంశాలను విద్యార్థులతో పంచుకున్నారు. ‘కంప్యూటింగ్‌ విధానాలు మరియు పరమాణు అంచనాలు‘ అనే అంశంపై మాట్లాడుతూ అణువుల లక్షణాలను అంచనా వేయడానికి గణన పద్ధతులను ఉపయోగించడం, అణువుల నిర్మాణాలు మరియు శక్తులను అంచనా వేయడానికి కొత్త పద్ధతుల అభివృద్ధి, అలాగే ఒకదానితో ఒకటి పరస్పర చర్యలు, ఇటీవల విజయాలను తెలియజేశారు. ఈ రంగంలో ఉన్న సవాళ్లు, భవిష్యత్‌ పరిశోధనలకు ఉన్న అవకాశాలపై కూడా ఆయన చర్చించారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ కాన్పూర్‌ ప్రొఫెసర్‌ డీఎల్‌వీకే ప్రసాద్‌ మాట్లాడుతూ ఉత్ప్రేరకము, బయోకెమిస్ట్రీ, మెటీరియల్‌ సైన్స్‌తో సహా వివిధ రంగాలలో కంప్యూటేషనల్‌ కెమిస్ట్రీ యొక్క ప్రయోజనాలను వివరించారు. తద్వారా జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునన్నారు. విద్యార్థులు తమ సహజ, సమకాలీన ఆలోచనల నుంచి బయటకు వచ్చి, కొత్తగా ఆలోచించాలన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, పరిశోధన విద్యార్థులు పాల్గొన్నారు.