అవకాశాలన్నీ మన దేశంలోనే..

అవకాశాలన్నీ మన దేశంలోనే!

  కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌
వేడుకగా విజ్ఞాన్స్‌ వర్సిటీ 11వ స్నాతకోత్సవం

1820 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం
51 మంది విద్యార్థులకు బంగారు పతకాలు
 ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్‌లు
  హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి, హైదరాబాద్‌లోని విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పీ వాసిరెడ్డి, ఇండియన్‌ చెస్‌ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపిలకు గౌరవ డాక్టరేట్‌లు.
అవకాశాలు అపారం... అందిపుచ్చుకోండి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక, ప్లానింగ్, కమర్షియల్‌ టాక్స్‌ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
ప్రణాళిక ఎంతో కీలకం : హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి

 వినూత్న పరిష్కారాలు వెతకండి :  హైదరాబాద్‌లోని విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పీ వాసిరెడ్డి సమ ప్రాధాన్యం ఇస్తే మేలు : ఇండియన్‌ చెస్‌ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి
  పట్టుదల, సంకల్పం మరువకూడదు : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం : విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలుప్రస్తుతం ప్రపంచంలో ఎక్కవ అవకాశాలు కలిగిన దేశమేదైనా ఉందంటే అది మన దేశమేనని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో 11వ స్నాతకోత్సవాన్ని సోమవారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌  మాట్లాడుతూ విదేశాల నుంచి 13 మేజర్‌ స్టార్టప్‌ కంపెనీలు మనదేశంలో ఇన్వెస్ట్‌మెంట్‌ పెట్టడానికి వస్తున్నాయని తెలియజేసారు. ఆ కంపెనీలన్ని ఉత్పత్తులను మన దేశంలో తయారుచేసి విదేశాలకు ఎగుమతి చేస్తాయని వెల్లడించారు. విద్యార్థులు సాఫ్ట్‌వేర్, ఐటీ కంపెనీలలో ఉద్యోగాలు మాత్రమే కాకుండా కొత్త మెటీరియల్స్, రేర్‌ మినరల్స్, మెటీరియల్‌ సైన్స్, డ్రోన్‌ టెక్నాలజీ వంటి రంగాలలో పరిశోధనలకు పూనుకోవాలన్నారు. దీనికి అనుగుణంగా ప్రస్తుత విద్యావిధానంలో ఎస్‌టీఈఎమ్‌ ( సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమాటిక్స్‌) కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా సహజసిద్ధమైన గ్యాస్‌ టెక్నాలజీ మీద కూడా పరిశోధనలు చేయాలన్నారు. ఇప్పటికే ఇస్రో తన చంద్రయాన్‌–3 ద్వారా దక్షిణ ధృవం మీదకు వెళ్లగలిగామని, 2040 నాటికి మానవసహిత ప్రయోగానికి పూనుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 2035 సంవత్సరంలోపు ‘‘భారత స్పేస్‌ స్టేషన్‌’’ను పెట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాలని ప్రధాని నరేంద్ర మోడి ఇస్రోకు సూచించారని వెల్లడించారు. విద్యార్థులందరూ మాస్టర్స్‌ డిగ్రీ కోసం విదేశాలకు వెళ్లినా నాలెడ్జ్‌ను బాగా పెంపొందించుకుని తిరిగి మనదేశానికే రావాలన్నారు. ప్రస్తుతం మనం పది రెట్లు అభివృద్ధి చెందితేనే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తామన్నారు. నేడు ప్రతి గ్రామానికి ఇంటర్నెట్‌ సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు. దేశ ప్రజలు కొత్త టెక్నాలజీలను అందుకోవడానికి తయారుగా ఉన్నారని తెలియజేసారు. నేడు చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా క్యూఆర్‌ కోడ్‌ సహాయంతో పేమెంట్లు అడిగే స్థాయికి ఎదిగేలా చేశామన్నారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీలను అందుకోవడానికి ప్రపంచంలో 38 శాతం మంది మాత్రమే తయారుగా ఉంటే... కేవలం మన దేశంలో మాత్రం 68 శాతానికి పైగా ప్రజలు తయారుగా ఉన్నారని పేర్కొన్నారు. మహా విశేషమైన విజయదశమి రోజున డిగ్రీ పట్టాలు అందుకుంటున్న మీరందరూ జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం చంద్రయాన్‌–3 విజయాన్ని విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలనే ఉద్ధేశ్యంతో చుట్టుపక్కల గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు చంద్రయాన్‌ నమూనాను బహుమతిగా అందజేసారు.
అవకాశాలు అపారం... అందిపుచ్చుకోండి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక, ప్లానింగ్, కమర్షియల్‌ టాక్స్‌ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
ప్రస్తుతం విద్యార్థులందరికీ అవకాశాలు అపారంగా ఉన్నాయని, వాటిని ఒడిసి పట్టుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక, ప్లానింగ్, కమర్షియల్‌ టాక్స్‌ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అన్నారు. విద్యార్థుల మేధోపరమైన, విద్యాపరమైన అన్వేషణను వారి వృత్తిపరమైన విజయాలను కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులతో జరుపుకోవడానికి ఇది ఒక చిరస్మరణీయ వేదిక అన్నారు. విద్యార్థులందరూ గురుకుల విద్యా విధానాన్ని తిరిగి తీసుకురావాలన్నారు. జీవితంలో మీరు ఏపని చేసిన ఇష్టంతో మనస్ఫూర్తిగా చేయండని పిలుపునిచ్చారు. ముగ్గురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు
స్నాతకోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో కృషి చేసిన హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి, హైదరాబాద్‌లోని విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పీ వాసిరెడ్డి, ఇండియన్‌ చెస్‌ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపిలకు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌లు ప్రదానం చేసింది. 

1820 మందికి డిగ్రీలు : విజ్ఞాన్స్‌ వర్సీటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌  మాట్లాడుతూ 11వ స్నాతకోత్సవం సందర్భంగా మొత్తం 1820 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసారు.  వీటితోపాటు 51 ( అకడమిక్‌ గోల్డ్‌ మెడల్స్‌– 24, బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ స్టూడెంట్‌ అవార్డులు–21, చైర్మన్‌ గోల్డ్‌ మెడల్‌–1, లావు వెంకటేశ్వర్లు, బండారుపల్లి వెంకటేశ్వరరావు, ఆలపాటి రవీంద్రనాథ్‌ ఎండోమెంట్‌ గోల్డ్‌ మెడల్స్‌–3, బెస్ట్‌ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌ అవార్డు–1, బెస్ట్‌ లీడర్‌ అవార్డు–1) మంది విద్యార్థులకు బంగారు పతకాలను  అందజేసారు. 

చక్కని ప్రణాళిక ఎంతో కీలకం : హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి

విద్య, ఉద్యోగం, ఆట, పాట... ఎందులో టాపర్‌గా నిలవాలన్నా మంచి అలవాట్లు, చక్కని ప్రణాళిక ఎంతో కీలకమని హైదరాబాద్‌లోని అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌ డాక్టర్‌ సుబ్బారావ్‌ పావులూరి అన్నారు. విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే వీటిని ప్రణాళికతో అమలు చేస్తే భవిష్యత్‌లో కోరుకున్న విభాగంలో రాణించడం సులువవుతుందన్నారు. విజ్ఞానాన్ని పెంపొందించుకోవడం ఒక్కటే విజయాన్ని అందించలేదు. ముఖ్యమైన జీవన నైపుణ్యాలను అలవర్చుకున్నవారే జీవితంలో రాణించగలరు. మేటి అకడమిక్‌ పరిజ్ఞానంతో పాటు విశ్వనైపుణ్యాలను సొంతం చేసుకున్నవారు వృత్తి జీవితంలోకి ధైర్యంగా అడుగుపెట్టి రాణించగలరు. జిజ్ఞాస, సమర్ధ సమయ పాలన, బుద్ధి స్థిరత్వం, వేగంగా సంగ్రహించుకోగలగడం... ఇలా ఎన్నో అంశాలు విజయాన్ని ప్రభావితం చేస్తాయన్నారు.

వినూత్న పరిష్కారాలు వెతకండి :  హైదరాబాద్‌లోని విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పీ వాసిరెడ్డి

సాంకేతిక పురోగతి నుంచి సామాజిక అసమానత వంటి అనేక గణనీయమైన సవాళ్లను ప్రపంచం ఎదుక్కొంటోందని  హైదరాబాద్‌లోని విమ్టా ల్యాబ్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ ఎస్‌పీ వాసిరెడ్డి  పేర్కొన్నారు. వీటిని కరుణ, సానుభూతి, ప్రపంచ పౌరసత్వ భావనతో పరిష్కరించడం రేపటి బాధ్యతాయుతమైన నాయకులుగా యువకుల బాధ్యత అన్నారు. వీటి కోసం వినూత్న పరిష్కారాలు వెతకాలని, స్థిరమైన భవిష్యత్‌కు కృషి చేయాలని కోరారు. 

సమ ప్రాధాన్యం ఇస్తే మేలు : ఇండియన్‌ చెస్‌ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి

చదువు ఆటలకు విద్యార్థులు సమ ప్రాధాన్యం ఇవ్వాలని, జీవితంలో ఆ రెండూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఇండియన్‌ చెస్‌ ప్లేయర్, పద్మశ్రీ, అర్జున అవార్డు గ్రహీత కోనేరు హంపి  తెలిపారు. శారీరక ఆరోగ్యానికి, మానసిక ఉత్సాహానికి క్రీడలు దోహదపడుతాయని అన్నారు. కెరీర్‌లో రాణించడానికి ప్రతి విద్యార్థి ఏకాగ్రతతో కృషి చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు నైపుణ్యాలు పెంపునకు చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడతాయని అన్నారు. చదువే కాకుండా ఏదో ఒక క్రీడ ఆడితే మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ధృఢత్వం ఉంటుందన్నారు. 

పట్టుదల, సంకల్పం మరువకూడదు : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

డిగ్రీ పట్టాలతో సమాజంలోకి అడుగుపెడుతున్న మీరు మీ లక్ష్యసాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టుదల, సంకల్పం మరువకూడదని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల అధినేత డాక్టర్‌ లావు రత్తయ్య విద్యార్థులకు ఉద్బోధించారు. మీరందరూ ప్రస్తుత ఉద్యోగాలతో సంతృప్తి చెందవద్దని, రాబోయే కొద్ది సంవత్సరాల్లో మీ కోసం మరిన్ని అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని తెలియజేసారు. ఆ అవకాశాలను మీరు అందుకోవాలని పిలుపునిచ్చారు. జనాభా పరంగా మనం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యువతరం కలిగిన దేశమన్నారు. భారతదేశ జనాభా సగటు వయస్సు 28.2 సంవత్సరాలు కావున, మన దేశం ఆవిష్కరణలు మరియు అభివృద్ధికి ప్రపంచ కేంద్రంగా మారడానికి సిద్ధమవుతోందన్నారు. ఎల్లప్పుడూ భవిష్యత్తు ప్రయత్నాలకు సంబంధించి మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. నేర్చుకునే క్రమంలో ఉండటానికి ప్రయత్నించండి. ఎప్పటికప్పుడు మీరు మిమ్మల్ని అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండాలని పిలుపునిచ్చారు. మీ విలువలు, వ్యక్తిగత నైతికతపై ఎప్పుడూ రాజీపడకూడదని, ఇండస్ట్రీలో మీ విశ్వసనీయతని, సమాజంలో ప్రతిష్టను నిర్ణయించేది మీ క్యారెక్టరేనని పేర్కొన్నారు. డిగ్రీలు చేతికందగానే అది మీ ప్రయాణానికి ముగింపు కాదని తెలుసుకోవాలన్నారు. అది జ్ఞానం కోసం జీవితకాల అన్వేషణకు నాంది అని గుర్తుంచుకోవాలని అన్నారు. సాహసాలు చేయడానికి ఎప్పుడూ వెనకాడకూడదని, అప్పుడే గొప్ప విజయాలు సిద్ధిస్తాయన్నారు. విజయం అంటే కేవలం వ్యక్తిగతమే కాదు. సమాజంలోని పక్కవారిని ఉద్దరించడమే నిజమైన విజయమన్నారు. విశ్వవిద్యాలయంలో నేర్చుకున్న జ్ఞానం, నైపుణ్యాలకు తగిన రంగాన్ని ఎంచుకుని అందులో రాణించాలన్నారు.


 
విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధం : విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు

విద్య అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఉజ్వల భవిష్యత్‌ను సృష్టించేందుకు, ప్రపంచాన్ని మార్చడానికి దోహదం చేస్తుందని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు  అన్నారు. జీవితంలో మీకు ఎలాంటి సమస్య రాకపోతే మీరు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నారని కచ్చింతంగా అనుకోవచ్చు. విజయం సాధించడం సులువుకాదు. సవాళ్లు లేని జీవితం వ్యర్థం. సవాళ్లను ఎదుర్కోకపోతే ఏమీ నేర్చుకోలేరు. జీవితంలో ఎదగలేరు. ఏదైనా సాధించడానికి తొలి అడుగు ఏదీ సులభంగా రాదని అంగీకరించడమే. సానుకూల దృక్పథమే అత్యంత ముఖ్యమైనది. మీ ఉత్సుకత ఎక్కడికి దారితీస్తుందో.. దాన్ని అన్వేషించండి. ఈ అన్వేషణకు భారతదేశం కంటే మెరుగైన ప్రదేశం మరొకటి లేదన్నారు. మన జీవితంలోని ప్రతి అంశం లోతైన విప్లవానికి లోనవుతోంది. ప్రతి మూలలో కొత్త ఆవిష్కరణలు వేళ్లూనుకుంటున్నాయి. మనం ఈ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతున్నప్పుడు సమాజంలోని వివిధ రంగాలలో సంభవించే విశేషమైన మార్పులను మనం అభినందించి తీరాలి. కంప్యూటర్లు, హార్డ్‌వేర్‌ రంగంలో, సెమీకండక్టర్‌ టెక్నాలజీలలో అసాధారణమైన విజృంభణను చూస్తున్నాము. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుదల ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ యొక్క సరిహద్దులను నెట్టివేస్తోంది. మనం జీవించే, పని చేసే విధానాన్ని మారుస్తుంది. మనం ఊహించలేని భవిష్యత్తును సృష్టిస్తుందని తెలియజేసారు.

బంగారు పతకాల విజేతలు వీరే..
స్నాతకోత్సవం సందర్భంగా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ఆయా విభాగాల్లో సత్తా చాటిన విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసింది.

ప్రతిష్టాత్మక చైర్మన్స్‌ గోల్డ్‌ మెడల్‌ –  తన్నీరు పూర్ణ వంశీక్రిష్ణ ( సీఎస్‌ఈ)
లావు వెంకటేశ్వర్ల ఎండోమెంట్‌ అవార్డ్‌ – నర్రా క్రిష్ణ ప్రియ ( ఈసీఈ)
బండారుపల్లి వెంకటేశ్వరరావు అవార్డ్‌ – ఈదర భువన (ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ)
ఆలపాటి రవీంద్రనాథ్‌ ఎండోమెంట్‌ అవార్డ్‌ – సబీహ ( బయో టెక్నాలజీ)
బెస్ట్‌ లీడర్‌ అవార్డు – గ్రంధి అజయ్‌ (బయో టెక్నాలజీ)
బెస్ట్‌ ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌అవార్డు  –  షేక్‌ అస్విల్‌ అహ్మద్‌ (బీసీఏ)

బెస్ట్‌ అవుట్‌గోయింగ్‌ స్టూడెంట్స్‌ అవార్డులలో 21
బయెటెక్నాలజీ విభాగం నుంచి మహమ్మద్‌ సబిహ
కెమికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం నుంచి పోకూరి ప్రభుతేజ
సివిల్‌ నుంచి పిన్ని నరేంద్ర
సీఎస్‌ఈ విభాగం నుంచి టీ.పూర్ణ వంశీక్రిష్ణ
ఈసీఈ నుంచి కేఎమ్‌.సాయి కిరణ్‌
ఈఈఈ విభాగం నుంచి వీ.వినయ్‌
ఐటీ నుంచి ఈదర భువన
మెకానికల్‌ విభాగం నుంచి మహమ్మద్‌ ఫిరోజ్‌
అగ్రికల్చరల్‌æ ఇంజినీరింగ్‌ నుంచి కే.సత్య వెంకటేష్‌
టెక్స్‌టైల్‌ నుంచి బింగి సంతోష్‌ కుమార్‌ 
బయోఇన్ఫర్మాటిక్స్‌ విభాగం నుంచి జీ.వంశిత చౌదరి
ఫుడ్‌ టెక్నాలజీ నుంచి గుడివాడ ద్రోణీ ప్రణీత
బీఎంఈ నుంచి ఆవులపాటి రమేష్‌ గాయత్రి
ఫార్మసీ నుంచి అభిషేక్‌ రాజ్‌
బీసీఏ నుంచి టీ.దేవిక
బీబీఏ నుంచి రాజ క్రిష్ణ లాస్య
బీఎస్సీ నుంచి చూడామణి కముజుల
ఎంబీఏ నుంచి ఎమ్‌. ప్రశాంతి
ఎంసీఏ నుంచి రెడ్డి గోపాల క్రిష్ణ
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ నుంచి ధూళిపాళ్ల శ్రీలక్ష్మి
ఎమ్మెస్సీ ఆర్గానిక్‌ కెమిస్ట్రీ నుంచి కోలా ధనలక్ష్మి  తదితరులు బంగారు పతకాలు సాధించారు. 

అంబరాన్నింటిన సంబరం

డిగ్రీలు చేతబట్టుకున్న వేళ విద్యార్థుల సంబరం అంబరాన్ని అంటింది. కేరింతలతో వర్సిటీ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. నాలుగేళ్ల తమ అనుభవాలను విద్యార్థులు ఒకరికొకరు పంచుకున్నారు. తరగతి గదుల్లో గడిపిన క్షణాలను నెమరువేసుకున్నారు. విశ్వవిద్యాలయంతో తాము పెంచుకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. సరదగా గడిపిన గడియలను మళ్లీ మళ్లీ గుర్తుచేసుకుంటూ సంతోషంగా గడిపారు. గుర్తుగా సెల్ఫీలు దిగారు. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిన బూనారు. విద్యార్థులంతా తలపాగా, కండువా వేసుకుని అచ్చతెలుగు పెద్ద మనుషుల్లా కనిపించారు. సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూనే సాంకేతిక విద్యా సర్టిఫికెట్లను పొందారు.

కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆర్థిక, ప్లానింగ్, కమర్షియల్‌ టాక్స్‌ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ , రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, బోర్డు ఆఫ్‌ మేనేజిమెంట్‌ సభ్యులు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది పాల్గొన్నారు.