విజ్ఞాన్స్‌లో ఘనంగా దాండియా ఉత్సవాలు

విజ్ఞాన్స్‌లో ఘనంగా దాండియా ఉత్సవాలు



చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో దసరా పండుగను పురస్కరించుకుని విద్యార్థులు దాండియా, బతుకమ్మ సంబరాలను శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవరాత్రి అంటే కేవలం తొమ్మిది రోజులు చేసుకునే ఉత్సవం కాదని... స్త్రీ తత్వం తాలూకు మూడు పరిమాణాలైన దుర్గ, లక్ష్మి, సరస్వతిగా కొలిచే ఉత్సవమన్నారు. అమ్మవారిని పూజిస్తే సిరి సంపదలు సిద్ధించడంతో పాటు సుఖసంతోషాలు కలుగుతాయని చెప్పారు. అమ్మవారిలోని ధైర్యసాహసాలను మహిళాలోకం ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నలుగురిలో కలవలేకపోతున్నామకునే విద్యార్థులకు నవరాత్రుల్లో చేసే దాండియా నృత్యాలు కొత్త ఉత్సాహాన్ని అందిస్తాయన్నారు. స్నేహితులు, బంధువులతో కలిసి నృత్యం చేయడం, సంతోషంగా గడపడం వంటివన్నీ మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయని విద్యార్థులకు తెలియజేసారు. మీరు ఎంచుకున్న నృత్యం ఏ రూపంలో ఉన్నా... అందరితో కలిసి ఆడుతూ, పాడుతూ ఉంటే మీలోనూ బృందస్ఫూర్తి పెరుగుతుందన్నారు. ఈ విధంగా నృత్యాలు చేయడం వల్ల శరీరం మొత్తానికి వ్యాయామం తో పాటు, గుండెకు రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందన్నారు. విద్యార్థులందరూ సంస్కృతి, సంప్రదాయాలను ఇదే విధంగా కొనసాగించాలన్నారు. ఆడపిల్లలు సల్లంగ బతకాలని కోరుతూ బతుకమ్మ పండుగకు ఆడపడుచులు ఊపిరిపోశారని విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.