"జ్ఞానపీఠ" అందుకున్న ప్రసిద్ధడు రావూరి భరద్వాజ స్మృతి దినం


గొప్ప భావుకుడైన తెలుగు కవి, రచయిత, 37 కథా సంపుటాలు, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించారు.తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన సాహితీవేత్త, వారి ఉతృష్ట రచనగా పరిగణింపబడే "పాకుడురాళ్ళు" నవలకు భారత దేశ అత్త్యుత్తమ సాహితీ పురస్కారం "జ్ఞానపీఠ"  అందుకున్న  ప్రసిద్ధడు రావూరి భరద్వాజ గారి స్మృతి దినం !
రావూరి భరద్వాజ (జూలై 5,1927-అక్టోబరు 18, 2013) తెలుగు లఘు కథా రచయిత, నవలా రచయిత, రేడియోలో రచయితగా పేరుతెచ్చుకున్నాడు. ఈయన బాలసాహిత్యంలో కూడా విశేషకృషి సలిపాడు.  సినీ పరిశ్రమలో తెరవెనుక జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చిత్రీకరించిన పాకుడు రాళ్ళు నవల భరద్వాజ యొక్క ఉతృష్ట రచనగా పరిగణింపబడుతుంది. ఈయన రచనలలో "జీవన సమరం" మరో ప్రముఖ రచన.
.....
తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడితడు. ఆడంబరాలులేని సాధారణ జీవితం ఆయనది. భరద్వాజకు దిగువ మధ్యతరగతి, పేదప్రజల భాషపై గట్టిపట్టు ఉంది. ఒక బీదకుటుంబంలో జన్మించిన భరద్వాజ కేవలం ఉన్నత పాఠశాల స్థాయివరకే చదువుకున్నాడు. ఆతరువాత కాయకష్టం చేసే జీవితాన్ని ప్రారంభించాడు. చిన్నతనంలో పొలాల్లో గడిపిన భరద్వాజ వ్యవసాయ కూలీల కఠినమైన జీవన పరిస్థితులను గమనించేవాడు. అప్పుడే పల్లెప్రజల భాష, యాస, ఆవేశాలు, ఆలోచనలు, కోపాలు, తాపాలు గమనించిన భరద్వాజ ఆ అనుభవాలను తర్వాతకాలంలో తన రచనలలో నిజమైన పల్లె వాతావరణాన్ని సృష్టించడానికి ఉపయోగించుకున్నాడు. 2013 అక్టోబరు 18న రావూరి భరద్వాజ తిరిగిరాని లోకాలకు తరలివెళ్ళారు.

• జీవిత విశేషాలు...

వీరు 1927 జూలై 5వ తేదీన కృష్ణా జిల్లా లోని నందిగామ తాలూకా కంచికచర్ల సమీపంలోని మోగులూరు (నాటి హైదరాబాదు సంస్థానంలోని) గ్రామంలో రావూరి కోటయ్య, మల్లికాంబ దంపతులకు జన్మించారు. వీరి విద్యాభ్యాసం 8వ తరగతి వరకే సాగింది. తొలి నాళ్ళలో రావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలిచేరి అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు. 1946లో నెల్లూరులోని జమీన్‌ రైతు వారపత్రిక సంపాదకవర్గంలో చేరాడు.1948లో దీనబంధు వారపత్రికకు బాధ్యుడుగా ఉన్నాడు. జ్యోతి,సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ పత్రికల్లో 1959వరకు కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేశాడు. అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి కొన్నాళ్ళపాటు ఖాళీగా ఉన్నాడు.
.....
ఆ తర్వాత హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు.

• రచయితగా....

రావూరి భరధ్వాజ గురించి చాలాకాలం పరిశోధన చేసి వారి రచనల గురించి సమగ్రమైన పరిశీలన చేసిన బొగ్గుల శ్రీనివాస్ ప్రకారం భరధ్వాజ సుమారు 187 పైగా పుస్తకాలను వెలువరించారు, 500 పైగా కథలను 37 సంకలనాలుగా, 19 నవలలు, 10 నాటకాలు వ్రాశారు. భరద్వాజ తన తొలి కథ ఒకప్పుడును 16 ఏళ్ల ప్రాయంలో వ్రాశాడు. ఇది జానపద శైలిలోసాగే కథ. భరద్వాజపై చలం ప్రభావం మెండుగా ఉంది. చలాన్ని అనుకరిస్తూ ఈయన అనేక సెక్సు కథలు వ్రాశాడు. త్వరలోనే సెక్సు కథలు వ్రాయటంలో అందెవేసినచెయ్యి అనిపించుకున్నాడు. అనేక పత్రికలు ఆ వ్యాసంగంలో ఈయన్ను ప్రోత్సహించాయి. ఏ మాత్రం సంకోచంగానీ, జంకుగానీ లేకుండా జీవనోపాధికై ఈయన అనేక కథలు వ్రాశాడు. విచిత్రమైన మానవ భావోద్వేగాలే ప్రధానాంశాలుగా కథలు వ్రాసే భరద్వాజ శైలి సరళమైనది. పాత్ర చిత్రీకరణలో, ఒక సన్నివేశాన్ని పరిచయం చేయటంలో రావూరి భరద్వాజకు ఉన్న ఒడుపు అద్భుతమైనది.

• జ్ఞానపీఠ పురస్కారం లభించిన
పాకుడురాళ్ళు....

పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ విశిష్టమైన నవలా రచన. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగులో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. భరద్వాజ దీనికి మాయ జలతారు అని నామకరణం చేశాడు. అయితే శీలా వీర్రాజు పాకుడురాళ్లు అనే పేరు పెట్టాడు. మల్లంపల్లి సోమశేఖరశర్మ, ముదిగొండ సుబ్రహ్మణ్యశర్మ ల ప్రోత్సాహంతో రావూరి భరద్వాజ తాను అంతకుమునుపే వ్రాసిన 'పాలపుంత' అనే ఓ పెద్ద కథని పాకుడురాళ్లు నవలగా వ్రాశాడు. ఈ నవల మూడు సంవత్సరాలపాటు కృష్ణా పత్రిక లో ధారావాహికగా వెలువడినది. ఈ పాకుడురాళ్లు నవలపై శ్రీకృష్ణదేవరాయ, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి.ఈ నవల రాసినందుకు రావూరికి 2013 లో సాహిత్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం లభించింది.

• ఈ నవల నేపథ్యం....

సినిమా ఓ రంగుల ప్రపంచం. లక్షలాదిమంది తమని తాము వెండి తెర మీద చూసుకోవాలని కలలు కంటూ ఉంటారు. కానీ ఆ కల నెరవేరేది ఏ కొద్ది మందికో మాత్రమే. పేరు ప్రఖ్యాతులు, వద్దన్నా వచ్చి పడే డబ్బు, సంఘంలో గౌరవ మర్యాదలు, పలుకుబడి. ఇవన్నీ తెచ్చిపెట్టగల శక్తి సినిమా అవకాశానికి ఉంది. అందుకే, సినిమాలన్నా, సినిమా వాళ్ళన్నా ఆసక్తి చూపించని వాళ్ళు అరుదు. అనాటి కాలంలో, సినిమా రంగంలో తెర వెనుక జరిగే రాజకీయాలనీ, ఎత్తులనీ, పై ఎత్తులనీ తమ పట్టు నిలుపుకోవడం కోసం రకరకాల వ్యక్తులు చేసే ప్రయత్నాలనీ నవలా రూపంలో అక్షరబద్ధం చేశాడు రచయిత రావూరి భరద్వాజ. పాకుడురాళ్ళు నవల, కేవలం మంజరిగా మారిన మంగమ్మ కథ మాత్రమే కాదు, తెలుగులో సినిమా నిర్మాణం ఊపందుకున్న రోజుల్లో ఆ పరిశ్రమలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరిదీ కూడా. ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటూ కూడా, అవసరార్ధపు స్నేహాలు నటించే ఇద్దరు అగ్ర హీరోలు, అగ్ర నాయికగా ఎదిగాక, అగ్ర హీరోలతో నటించనని ప్రకటించి కొత్త నాయకులని పరిచయం చేసే నాయిక, సినిమా వాళ్ళని బెదిరించి పబ్బం గడుపుకునే సినీ విలేఖరి, ఇలా ఎందరెందరిదో కథ ఇది.

• నవలా స్వరూపం....

కథా స్థలం గుంటూరు సమీపంలో ఓ పల్లెటూరు. కథా కాలం పద్య నాటకాలు అంతరించి, సాంఘిక నాటకాలు అంతగా ఊపందుకోని రోజులు. నాటకాలంటే ఆసక్తి ఉన్న మాధవరావు, రామచంద్రం కలిసి 'నవ్యాంధ్ర కళామండలి' ప్రారంభించి, సాంఘిక నాటకాలు ప్రదర్శించాలి అనుకుంటారు. వాళ్ళ నాటకాల్లో స్త్రీ పాత్రలు ధరించడం కోసం వస్తుంది పదిహేనేళ్ళ మంగమ్మ. బళ్ళారి రాఘవ ట్రూపులో పనిచేశానని చెప్పుకునే నాగమణి పోషణలో ఉంటుంది మంగమ్మ. అప్పటికే మంగమ్మ మీద సంపాదన ప్రారంభించిన నాగమణి, నాటకాల్లో అయితే ఎక్కువ డబ్బు రాబట్టుకోవచ్చునని ఈ మార్గం ఎంచుకుంటుంది. మాధవరావు-రామచంద్రం తర్ఫీదులో మంచి నటిగా పేరు తెచ్చుకుంటుంది మంగమ్మ. కళామండలి కి మంచి పేరు రావడంతో, నాగమణి కి కొంత మొత్తం చెల్లించి మంగమ్మని చెర విడిపిస్తారు మిత్రులిద్దరూ.
.....
కొంతకాలానికి కళామండలి మూతపడే పరిస్థితి వస్తుంది. మంగమ్మ, నాగమణి 'కంపెనీ' కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా మద్రాసు నుంచి వచ్చిన పాత మిత్రుడు చలపతి తనో సినిమా తీస్తున్నాననీ, మంగమ్మ అందులో నాయిక అనీ చెప్పి ఆమెని మద్రాసు తీసుకెడతాడు. చలపతి సినిమా తీయకపోయినా, మంగమ్మకి వేషాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తాడు. స్వతహాగా తెలివైనదీ, మగవాళ్ళని కాచి వడపోసినదీ అయిన మంగమ్మ సైతం -మొదట్లో ఆసక్తి చూపకపోయినా, సినిమా హీరోయిన్ల వైభవం, ఐశ్వర్యం చూశాక తనుకూడా హీరోయిన్ కావాల్సిందే అని నిర్ణయించుకుని తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలో, ఓ సిద్ధాంతి సూచన మేరకు తన పేరు మంజరి గా మార్చుకుంటుంది. వేషాలు రానప్పుడూ, చివరివరకూ వచ్చి జారిపోయినప్పుడూ మంజరి నిర్ణయం మరింత పదునెక్కుతూ ఉంటుంది.
......
మెల్లగా అవకాశాలు సంపాదించుకుని, నాయికగా పేరు తెచ్చుకుని తక్కువ కాలంలోనే అగ్రశ్రేణి నాయిక అవుతుంది మంజరి. అనుకున్నది సాధించాక ప్రపంచాన్ని లెక్కచెయ్యదు మంజరి. చలపతిని కేవలం ఓ సెక్రటరీగా మాత్రమే చూస్తుంది. నిర్మాతలని అక్షరాలా ఆడిస్తుంది. అయితే, తనని తీర్చిదిద్దిన మాధవరావు-రామచంద్రం మీద, కష్టకాలంలో తనని ఆదుకున్న వాళ్ళమీదా అంతులేని కృతజ్ఞత చూపుతుంది మంజరి. అగ్రహీరోలతో కయ్యం పెట్టుకుని, దానివల్ల తనకి పోటీగా మరో నాయిక తయారవుతున్నప్పుడు కయ్యాన్ని నెయ్యంగా మార్చుకున్నా, తనని సినిమా నుంచి తీసేయాలని ప్రయత్నించిన నిర్మాతకి ఊహించని విధంగా షాక్ ఇచ్చినా మంజరికి మంజరే సాటి అనిపిస్తుంది. గుర్రాప్పందాల మీద లక్షలు నష్టపోయినా కొంచం కూడా బాధ పడదు కానీ, ఎవరన్నా డొనేషన్ అంటూ వస్తే రెండో ఆలోచన లేకుండా తిప్పి పంపేసి మళ్ళీ రావొద్దని కచ్చితంగా చెప్పేస్తుంది. తెలుగులో అగ్రస్థానంలో ఉండగానే, హిందీ అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెడుతుంది మంజరి. ఇందుకోసం తన కాంటాక్ట్స్ ని తెలివిగా వాడుకుంటుంది. భారదేశం తరపున సాంస్కృతిక రాయబారిగా అమెరికా వెళ్ళిన తొలి తెలుగు నటి మంజరి. అక్కడ మార్లిన్ మన్రో ని కలుసుకున్న మంజరి, సిని నాయికలందరి జీవితాలూ ఒకేలా ఉంటాయన్న సత్యాన్ని తెలుసుకుంటుంది.

• అవార్డులు...

రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌర్రవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి.

1) 1980 - కళాప్రపూర్ణ - ఆంధ్ర విశ్వవిద్యాలయం.
2) 1983 - కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం.
3) 1985 - సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం ఇనుక తెర వెనకకు లభించింది.
4) 1987 - రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు
5) 1987 - తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు
6) 1997లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యలో విశిష్ట పురస్కారం
7) 2007 - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు
8) 2008 - లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం (వినూత్న సాహితీ ప్రక్రియ కల్పించినందుకు, డిసెంబరు 4 వ తేదీన ప్రకటించారు)
9) 2011 - కేంద్ర సాహిత్య అకాడమీ, వంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు.
10) 2012 - జ్ఞానపీఠ అవార్డు తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన బహుముఖమైన కృషికి దక్కింది.