మహాత్ముని మార్గం సర్వదా ఆచరణీయం

 మహాత్ముని మార్గం సర్వదా ఆచరణీయం

విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య

విజ్ఞాన్స్‌లో ఘనంగా గాంధీ జయంతి ఉత్సవం



మహాత్ముని మార్గం సర్వదా ఆచరణీయమని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో దేశ జాతిపిత మహాత్మా గాంధీ 154వ జయంతి, స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ప్రధాని భారతరత్న లాల్‌ బహుదూర్‌ శాస్త్రి జయంతి ఉత్సవాలను  సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందనే విషయాన్ని ఆనాడే చెప్పిన ఘనుడని తెలియజేసారు.  గాంధీ చూపిన మార్గం వలనే నేడు మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోగలుగుతున్నామని పేర్కొన్నారు. పూజ్య బాపూజీ కలలు కన్న ఆశయాలను నెరవేర్చవలసిన బాధ్యత మన అందరిపైన ఉందన్నారు. మహనీయుడు మహాత్మాగాంధీ చూపిన మార్గంలో  విద్యార్థులందరూ పయనించాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ మహాత్మా గాంధీ మార్గాన్ని అనుసరించి చూపితే... అదే మనం ఆయనకు ఇచ్చే ఘన నివాళి అని తెలియజేసారు. గాంధీజీ తాను నమ్మిన సిద్ధాంతాల కోసం ఎంతటిదాకైనా పోరాటం చేసే వ్యక్తిత్వం ఆయన సొంతమన్నారు. సాటి మనుషులతో కఠినంగా కాకుండా... మృదువుగా, సూటిగా అర్థమయ్యేటట్లు మాట్లాడటం వల్లే స్వాతంత్య్ర కాంక్ష సాధ్యమైందన్నారు.  శాంతి, అహింస అనే సూత్రాలతోనే భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించేలా చేసిన మహోన్నత వ్యక్తి గాంధీజీ అని కొనియాడారు.విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మహాత్ముడి ఆశయ సాధనకు విద్యార్థులు కృషి చేయాలన్నారు. యావత్‌ భారతావని కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచాయన్నారు. అహింసా మార్గం ద్వారా దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ భారతదేశానికే మాత్రమే కాకుండా, అంతర్జాతీయ మార్గదర్శకుడిగా, దార్శనికుడిగా నిలిచారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి బాపూజీని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.విజ్ఞాన్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎం.ఎస్‌. రఘునాథన్‌ మాట్లాడుతూ గాంధీ మార్గాలను అనుసరించిన నెల్సన్‌ మండేలా దక్షిణాఫ్రికా దేశానికి స్వాంతంత్య్రం సిద్ధించేలా చేశారన్నారు. అహింసతో స్వాతంత్య్రాన్ని సముపార్జించిన మహాత్మ గాంధీజీ జీవితంపై ప్రపంచంలోని అనేక దేశాలు పరిశోధనలు చేస్తున్నాయన్నారు. అయితే ప్రస్తుతం గాంధీజీ చెప్పింది మనం ఎంతవరకు అనుసరిస్తున్నామో ప్రశ్నించుకోవాలన్నారు.  గాంధీ జయంతిని భారతదేశంతో పాటు వివిధ దేశాలలో కూడా నిర్వహిస్తున్నారంటే ఆయన గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదన్నారు. 200 సంవత్సరాల పాటు బ్రిటీష్‌ పాలనలో దోపిడీకి గురికాబడ్డ మనకు స్వాతంత్య్రం వచ్చిందంటే... గాంధీజీ కృషి వలనే వచ్చిందని పేర్కొన్నారు.   అనంతరం గాంధీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసారు. యూనివర్సిటీ విద్యార్థులకు మాత్రమే కాకుండా శేకూరు, అంగలకుదురు, వేజండ్ల, నారాకోడూరు గ్రామాల్లోని జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ విద్యార్థులకు గాంధీ జయంతిని పురస్కరించుకుని ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్‌ పోటీలను నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో విజ్ఞాన్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.