చిన్ననాటి స్నేహితుల్ని మర్చిపోలేను

చిన్ననాటి స్నేహితుల్ని మర్చిపోలేను 
-  సినీ దర్శకుడు మారుతి 

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మచిలీపట్నం జార్జికారనేషన్ హైస్కూల్కు చెందిన మారుతి బాల్య స్నేహితులు అక్టోబర్ 1 వ తేదీ గెటు గెదర్ కార్యక్రమంతో పాటు , స్వయంకృషితో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించుకున్న తమ చిన్ననాటి స్నేహితుడు మారుతిని ప్రేమగా సత్కరించుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు . ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా క్షణం తీరిక లేకుండా ఉన్న ఆయన ఈ కార్యక్రమానికి విచ్చేసి దాదాపు 4 గంటల పాటు చిన్ననాటి స్నేహితులను పేరు పేరునా పలకరించి , వారితో గడపడం విశేషం . తన చిన్ననాటి సంఘటనలను , తాను కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఎదిగిన విధానాన్ని వివరించడంతో పాటు , తన స్నేహితులు ఎవరెవరు ఏఏ రంగాల్లో ఉన్నారు . వారు కూడా జీవితంలో ఎదగటానికి ఎంత కష్టపడ్డారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు . అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించి , సన్మానపత్రం కూడా అందజేశారు .
" బాల్యం నుంచి ప్రతి దశలోనూ మన జీవితంలో ఎంతోమంది పరిచయం అవుతూ ఉంటారు . కాలక్రమంలో అందులో కొందరిని మనం మర్చిపోవడం సహజం . కానీ జీవితపు తొలి దశలో ప్రేమాభిమానాలు కురిపించే బాల్య స్నేహితులను మాత్రం కాదు " అన్నారు దర్శకులు మారుతి .
ఈ కార్యక్రమానికి విశిష్ఠ అతిథులుగా 30 సంవత్సరాల క్రితం జార్జికారనేషన్ స్కూల్లో తమకు పాఠాలు బోధించిన  ఉపాధ్యాయులను ఆహ్వానించి , వారికి గౌరవ సత్కారం చేశారు .
 ఈరోజుల్లో  ' సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటి .. ' బస్టాప్ ' , ' ప్రేమకథా చిత్రమ్ ' , ' భలే భలే మగాడివోయ్ ' , ‘ శైలజారెడ్డి అల్లుడు ' , ' బాబు బంగారం ' , ' కొత్త జంట ' . ‘ ప్రతిరోజూ పండగే ' ' మహానుభావుడు ' , ' పక్కా కమర్షియల్ ' ఇలా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు
మారుతి . ప్రస్తుతం ఆయన ప్రభాస్ హీరోగా ఓ చిత్రాన్ని తెరెక్కిస్తున్నారు . ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది . ఈ సినిమా ఘన విజయం సాధించి తమ స్నేహితుడు మారుతి కూడా ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా ఎదగాలని ఆయన స్నేహితులు కోరుకున్నారు . అలాగే ఈనెల 8 న పుట్టిన రోజు జరుపుకుంటున్న మారుతికి అడ్వాన్స్డ్ బర్త్ డే విషెస్ తెలియజేశారు .