ఆలిండియా త్రోబాల్‌ జట్టుకు విజ్ఞాన్స్‌ విద్యార్థిని ఎంపిక

ఆలిండియా త్రోబాల్‌ జట్టుకు విజ్ఞాన్స్‌ విద్యార్థిని ఎంపిక

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు చెందిన రెండో సంవత్సరం సీఎస్‌ఈ (ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌) డిపార్ట్‌మెంట్‌కు చెందిన  కిలారు భార్గవి అనే విద్యార్థిని ఆలిండియా త్రోబాల్‌ జట్టుకు ఎంపికైందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లోని బిజునూర్‌లో జరిగిన 43వ సీనియర్‌ నేషనల్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌–2023 టోర్నమెంట్‌లో ఉత్తమ ప్రదర్శనకు గాను తమ విద్యార్థి ఆలిండియా జట్టుకు ఎంపికైందని వెల్లడించారు. వచ్చే సంవత్సరం జనవరి నెలలో దుబాయ్‌ దేశంలో జరిగే ఇంటర్నేషనల్‌ త్రోబాల్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొంటుందని తెలియజేసారు. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన టౌర్నమెంట్‌లో పది రాష్ట్రాలకు చెందిన జట్లు నాలుగు రోజుల పాటు జరిగిన లీగ్‌ కమ్‌ నాకౌట్‌ మ్యాచ్‌లలో తమ యూనివర్సిటీకు చెందిన మొత్తం 5 గురు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర టీమ్‌ తరుపున పాల్గొని రెండో స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ టీమ్‌ తరుపున తమ యూనివర్సిటీకు చెందిన రెండో సంవత్సరం విద్యార్థులు కిలారు భార్గవి ( సీఎస్‌ఈ), కేతినేని గాయత్రి ( సీఎస్‌ఈ), మామిళ్లపల్లి తేజస్వి (బయోటెక్‌), కట్టా వైష్ణవి ( ఐటీ), మొదటి సంవత్సరంకు చెందిన శ్రీవర్షిత ఇంకుర్తి ( డీసీఎస్‌ఈ)లు పాల్గొన్నారని తెలియజేసారు. ఆలిండియా త్రోబాల్‌ జట్టుకు ఎంపికైన విద్యార్థినితో పాటు ఆంధ్రప్రదేశ్‌ టీమ్‌ తరుపున పాల్గొని రెండో స్థానంలో నిలిచిన విద్యార్థులను వర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరక్టర్, కోచ్‌లు, సిబ్బంది అభినందించారు.