విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయ స్థాయి పేటెంట్‌

చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు జాతీయస్థాయి పేటెంట్‌ మంజూరయ్యిందని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణం శనివారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ జీ.శ్రీనివాసరావు, జేఎన్‌టీయూ కాకినాడలోని ఈఈఈ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఎస్‌.శివనాగరాజులు సంయుక్తంగా ప్రతిపాదించిన ‘‘ హైబ్రిడ్‌ ఆటో రిక్షా’’ అనే అంశానికి ప్రముఖ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఇండియా అథారిటీ పేటెంట్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిందన్నారు. వీరు ప్రతిపాదించిన ఈ పేటెంట్‌కు 20 సంవత్సరాల పాటు హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పేటెంట్‌ వలన హైబ్రిడ్‌ ఆటో రిక్షాల సహాయంతో దేశంలోని పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో శబ్ధ, కాలుష్య రహిత రవాణా వ్యవస్థను అందించవచ్చునన్నారు. ఆటో రిక్షాల నిర్మాణంలో గణనీయమైన మార్పులు అవసరం లేకుండా ఎలక్ట్రిక్‌ హైబ్రిడ్‌ ఆటో రిక్షాను అభివృద్ధి చేయవచ్చునన్నారు. అదే సమయంలో సోలార్‌ బ్యాటరీ చార్జ్‌ సిస్టమ్‌ సహాయంతో విద్యుత్‌ శక్తిని కూడా ఆదాచేయవచ్చని తెలియజేశారు. దీని సహాయంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధిని అందించవచ్చునని వెల్లడించారు. జాతీయ స్థాయి పేటెంట్‌ పొందిన రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డీన్‌ ప్రొఫెసర్‌ జీ.శ్రీనివాసరావును విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ ప్రత్యేకంగా అభినందించారు.