విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో సీఎస్‌సీ అకాడమీ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో సీఎస్‌సీ అకాడమీ అవగాహన ఒప్పందం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ భారత ప్రభుత్వంలోని మినిస్ట్రీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ విభాగంతో నిర్వహించబడుతున్న విశాఖపట్నంలోని సీఎస్‌సీ (కామన్‌ సర్వీస్‌ సెంటర్‌) అకాడమీతో సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎస్‌ఎస్‌ అకాడమీ వర్చువల్‌ లెర్నింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ రామ్‌ మోహన్‌తో వర్సిటీ ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన 8000 విద్యార్థులతో పాటు అధ్యాపకులకు కూడా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ టెక్నాలజీపైన ఉచితంగా శిక్షణ అందిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సీ–డాక్, ఐఈఈఈ సంస్థల ద్వారా సర్టిఫికెట్‌లను అందిస్తామన్నారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ఉపయోగపడే విధంగా పరస్పర అవగాహనతో యూనివర్సిటీలోకానీ, వర్చువల్‌గా కానీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారని తెలియజేసారు. సీఎస్‌ఎస్‌ అకాడమీ వర్చువల్‌ లెర్నింగ్‌ ఎగ్జిక్యూటివ్‌ రామ్‌ మోహన్‌ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు ఇండస్ట్రీ లేదా వృత్తితో సంబంధం లేకుండా డిజిటల్‌ ప్రపంచంలో వస్తున్న సాంకేతికతను స్వీకరించాలన్నారు. విద్యార్థులకు నైపుణ్యాలను పెంచే ప్రయత్నంలో విజ్ఞాన్స్‌ విశ్వవిద్యాలయంతో భాగస్వామి అయినందుకు మేము సంతోషిస్తున్నామని వెల్లడించారు. కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఇంచార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ పీఎంవీ రావు, ఆయా విభాగాల అధిపతులు పాల్గొన్నారు.