నాయకుడంటే నలుగురి కోసమే..

నాయకుడంటే 
నలుగురి కోసమే కానీ  
నాలుగు మెతుకులు కొసం
ఆరాట పడని వాడని...!
నాయకుడంటే 
సమాజానికై తాను మారుతూ
రేపటి సమాజం కోసం బలమైన పునాదిలా నిలిచే వీరబాహుడని
నాయకుడంటే 
తనతో తానే యుద్ధం చేస్తూ
తన'లో' నుండి మొదలై జనం'లో ' కి  లావాలా ప్రవహించే వాడని...!
నాయకుడంటే
నాలుగు జ్ఞాన విత్తుల కోసం
గజ్జె గట్టి, డప్పుగొట్టి చిందై నర్తిస్తూ
నాలుగూళ్ళకు నానుడయ్యే వాడని...!
నాయకుడంటే
కాలం నిత్యం మారుతున్నా  
పట్టిన విలువని పిడికిలి బిగువుతో 
వెన్నుముకల్లే నిటారుగా నిల్పెటోడని
నాయకుడంటే
ఉద్యమాన్ని ఎత్తుకుని గ్రామాలకు తరలెల్లే మద్ధ్యాన్నపు సూర్యుని మల్లె వెలిగిన నిజమైన దేశభక్తుడని
నాయకుడంటే
కారంచేడు నుండి కొల్లిపర దాకా
అహంకారాన్ని ఎదిరించే ముల్లుగర్రై నీలిజెండా పోరులో కలబడి నిలబడే దళిత బెబ్బులి అని...!
'నాయకుడు' అనే  ఒక పదాన్ని జీవిత కాలం దాని నిజమైన 
అర్ధ గౌరవంతో  ఆత్మ గౌరవంతో
విర్రవీగేలా చేసిన విప్లవ వీరుడా 
మార్క్స్ ఫూలే అంబేడ్కర్  రంజన్ బాబు ల ఆశయ సాధకుడా 
నా భావజాలపు సహోదరుడా 
కె వై రత్నమా(కనపర్తి యేసు రత్నం)
నీకు నా అరుణారుణ నీలి జెండా  లాల్ నీల్ సలామ్ లు ✊

- డా  పిల్లి వాసు, ఐతానగర్ -