ప్రేమతోనే సమస్యలకు పరిష్కారం

ప్రేమతోనే సమస్యలకు పరిష్కారం

  స్టూడెంట్‌ కౌన్సిలర్, మోటివేషనల్‌ స్పీకర్‌ ఆర్‌.శ్రీనివాసరావ్‌
విజ్ఞాన్స్‌ వర్సీటీలో ఘనంగా సెమీ క్రిస్ట్‌మస్‌ వేడుకలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సమాజంలోని చాలా సమస్యలను డబ్బు పరిష్కరించలేదని.... ప్రేమతో అన్ని సమస్యలను తీర్చవచ్చునని స్టూడెంట్‌ కౌన్సిలర్, మోటివేషనల్‌ స్పీకర్‌ ఆర్‌.శ్రీనివాసరావ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని విద్యార్థుల ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్‌ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్టూడెంట్‌ కౌన్సిలర్, మోటివేషనల్‌ స్పీకర్‌ ఆర్‌.శ్రీనివాసరావ్‌ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ ఇంకా నేను ఎక్కువ రోజులు బతకాలని ఆశపడతాడే గాని.... ఏదో ఒకరోజు మరణించాల్సిందే కదా అనే విషయాన్ని మాత్రం అంగీకరించడని పేర్కొన్నారు. విద్యార్థులందరూ జీవితంలో ఎదురయ్యే సమస్యలతో పాటు నిజాలనేవి కఠినంగా ఉన్నా సరే ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధపడాలన్నారు. మరణం గురించి ఎవరూ చింత చెందుతూ భయపడవద్దన్నారు. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టసుఖాలనేవి సాధారణమని, జీవితంలో చీకటి తర్వాత వెలుగులు కూడా నిండుతాయని తెలియజేసారు. జీవితంలో దేవుడు ఎప్పడు మీకు తోడుగా ఉంటాడని, మిమ్మల్ని సమున్నత స్థానాలకు తీసుకెళ్తాడని తెలియజేసారు. ఏసుక్రీస్తు బోధనలు వర్తమాన సమాజానికి మార్గదర్శకాలని పేర్కొన్నారు. సత్యం, ధర్మం, శాంతి, సహనం అనే ఆయుధాలను ఏసుక్రీస్తు ప్రపంచానికి అందించారన్నారు. ధర్మం కోసం అడుగులు వేసే ఎవరైనా సత్యాన్ని నిర్భయంగా ప్రకటిస్తారనేది క్రీస్తు జీవితం ద్వారా మనకు తెలుస్తుందని, సత్యాన్ని మానవాళికి ప్రకటించడంతో శాంతి, సహనాలను ప్రభువు ఎప్పడూ విడిచిపెట్టలేదని చెప్పారు.  ఈ సందర్భంగా విద్యార్థులు క్రిస్మస్‌ కేక్‌ కట్‌ చేశారు. స్వీట్లు పంచుకున్నారు. విద్యార్థులు ఆలపించిన క్రిస్మస్‌ గీతాలు ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలు కట్టిపడేశాయి. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.