రోడ్డు ప్రమాదాల నివారణ యువశక్తితోనే సాధ్యం

రోడ్డు ప్రమాదాల నివారణ యువశక్తితోనే సాధ్యం

  తెనాలి డివిజన్‌ ఆర్టీవో కే.ప్రసాద్‌
 రహదారి భద్రతపై విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో విద్యార్థులకు అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే యువశక్తిలో వచ్చే మార్పుతోనే సాధ్యమవుతుందని తెనాలి డివిజన్‌ ఆర్టీవో కే.ప్రసాద్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శనివారం విజ్ఞాన్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో ‘‘రహదారి భద్రత – జీవితానికే రక్ష’’ అనే అంశంపై విద్యార్థులకు అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్‌ను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి డివిజన్‌ ఆర్టీవో కే.ప్రసాద్‌ మాట్లాడుతూ దేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, అయితే రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోయేవారిలో ఎక్కవ మంది యువతే ఉన్నారని పేర్కొన్నారు. యువత ప్రమాదాల బారిన పడి తల్లిదండ్రులకు గుండెకోత మిగల్చరాదన్నారు. ప్రాణం ఎంతో విలువైనదని, ఏ ఒక్కరూ కూడా రోడ్డు ప్రమాదాల్లో మరణించకూడదనే ఉద్దేశ్యంతో అన్ని రకాలుగా కృషి చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్‌ బెల్ట్‌ ధరించాలని పదేపదే అవగాహన కల్పిస్తున్నప్పటికీ యువత పెడచెవిన వేస్తున్నారన్నారు. వీటితో పాటు యువత వారి స్నేహితులు తీసుకువచ్చే వివిధ రకాల డిజైన్ల వాహనాలను చూసి కూడా ప్రభావితమవుతున్నారన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన తెనాలి డివిజన్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ కే.రాఘవరావు మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, రాష్‌ డ్రైవింగ్, సిగ్నల్‌ జంపింగ్‌ వంటి నేరాలను చేయకూడదన్నారు. వాహనం నడిపే ప్రతి ఒక్కరి దగ్గర డ్రైవింగ్‌ లైసెన్స్, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్, ఇన్సురెన్స్‌ సర్టిఫికెట్, పొల్యూషన్‌ సర్టిఫికెట్‌లు ఉంచుకుని హెల్మెట్‌ తప్పక ధరించాలన్నారు. ప్రయాణీకులను సుఖంగా, భద్రంగా గమ్యం చేర్చాలన్నా, రోడ్డు ప్రమాదాలను నివారించాలన్నా డ్రైవర్ల అప్రమత్తతోనే సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు, వర్సిటీ బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.