విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో టీఎస్‌ఎస్‌సీ అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో టీఎస్‌ఎస్‌సీ అవగాహన ఒప్పందం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో న్యూఢిల్లీలోని టీఎస్‌ఎస్‌సీ (టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌) అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని బుధవారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టెలికాం సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ సీఈవో అరవింద్‌ బాలితో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌ ప్రమోషన్స్‌ కొలాబరేషన్స్‌ అండ్‌ ఫ్యాకల్టీ అఫైర్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అవగాహన ఒప్పందం అనంతరం వివిధ విభాగాల డీన్లు, అధిపతులతో టీఎస్‌ఎస్‌సీ సీఈవో అరవింద్‌ బాలి ఇంటరాక్టివ్‌ సెషన్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు భారతదేశం స్కిల్‌ క్యాపిటల్‌గా ఏర్పాటు కాబోతుందన్నారు. దేశంలోని యువతకు స్కిల్‌ను డెవలప్‌ చేసి టెలికాం సెక్టార్‌లో ఉపాధి చూపించడమే మా లక్ష్యమని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇండస్ట్రీ 4.0, వెబ్‌ 3.0, 5జీ నెట్‌వర్క్, ఐవోటీ, డ్రోన్స్, ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ వంటి కొత్త టెక్నాలజీల్లో యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి డిజిటల్‌ ఇండియాగా మార్చబోతున్నామన్నారు. టెలికాం రంగం, డిజిటల్‌ టెక్నాలజీలో ప్రత్యేక శిక్షణ ద్వారా పరిశ్రమలకు అవసరమైన టెక్నాలజీలను విద్యార్థులకు అందించడం ద్వారా ఇండస్ట్రీ డిమాండ్‌ను తగ్గించవచ్చునన్నారు. నైపుణ్యాభివృద్ధితోనే జీవితంలో మంచి ఉపాధిని, ఉన్నత స్థానాలను పొందగలరన్నారు. కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.