విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

విజ్ఞాన్‌ యూనివర్సిటీలో వైభవంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం భారత 75వ గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు యుద్ధాల్లో వీర మరణం పొందిన సైనికులకు నివాళిగా ఏర్పాటు చేసిన అమర్‌ జవాన్‌ స్థూపానికి నివాళులర్పించి జ్యోతి వెలిగించారు. విద్యార్థులు 100 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీ, ఎన్‌సీసీ పరేడ్‌ ఎంతగానో ఆకర్షించాయి. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ గడిచిన 75 ఏళ్లలో మన దేశం అనేక రంగాల్లో విస్తృతంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎంతో ఉన్నతిని మనం సాధించాల్సి ఉందన్నారు. మన యువత శారీరక, మానసిక దృఢత్వం మన దేశ భవిష్యత్తుకు ఎంతో అవసరమని పేర్కొన్నారు. తమకు నచ్చిన రంగాల్లో యువత నైపుణ్యాలు మెరుగుపరుచుకోవాలని సూచించారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ మాట్లాడుతూ విద్యార్థులందరూ ప్రాథమిక హక్కులను ఎలాగైతే వినియోగించుకుంటున్నారో ప్రాథమిక విధులను కూడా అలాగే పాటించాలన్నారు. 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఇదే రోజున బ్రిటీష్‌ కాలం నాటి భారత ప్రభుత్వ చట్టం 1935 రద్దయి మన దేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగా ఏర్పాటయిందని గుర్తుచేశారు. 1949 నవంబర్‌ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్‌ ఆమోదించిందని పేర్కొన్నారు. మహానీయుల త్యాగాల వల్లనే దేశ స్వాతంత్య్రం సాధ్యమైందని, యువత దేశ నాయకులను ఎప్పటికీ గుర్తుంచుకోవాలని సూచించారు. విద్యార్థులు యంగ్‌ ఇండియాను నిర్మించాలని కోరారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచిస్తే సరికొత్త ఆవిష్కరణలను సృష్టించవచ్చునన్నారు. దేశ అభివృద్ధికి మీరేం చేయగలరో ఆలోచించండని, మనం అభివృద్ధి చెందితే దేశం కూడా అభివృద్ధి చెందినట్లే అని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.