ఒక ఆడపిల్లగా సొంతంగా ఎదగడం ఎంతో కష్టం

ఒక ఆడపిల్లగా సొంతంగా ఎదగడం ఎంతో కష్టం.
 - సినీ, టీవీ, రంగస్థల నటి,దర్శకురాలు డా.శ్రీజ సాదినేని
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఒంటరిగా ఆడపిల్ల ఎదగాలి అంటే ఈ సమాజంలో ఎంత కష్టమో 20 ఏళ్ల నుండి చూస్తున్నాను. అయినా పోరాట పటిమ వదలకుండా నా సంస్థను ఈ స్థాయికి తీసుకుని వచ్చాను" అన్నారు సినీ,టీవీ,రంగస్థల నటి, దర్శకురాలు డా.శ్రీజ సాదినేని.
డిసెంబర్ 30, శనివారం నాడు
తమ సొంత సంస్థ శ్రీ జయా ఆర్ట్స్ ఇరవయ్యవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు శ్రీజ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ " నాటకరంగం మీద మమకారంతో సాంస్కృతిక సంస్థను 2003 డిసెంబర్ 30 న స్థాపించి తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 33 తెలుగు నాటిక, నాటకాలు రూపొందించిన శ్రీజ తన కళా రంగ ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్ళను, సమస్యలను ఎంతో ధైర్యంగా అధిగమించి ఇప్పటి వరకూ రెండు వేల మందికి పైగా విద్యార్థులకు నటనలో శిక్షణ ఇచ్చి నాటక, టీవీ, సినీ రంగాలలో అవకాశాలు కల్పించినందుకు ఎంతో గర్వంగా ఉంది అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆడపిల్ల దర్శకత్వం అంటే తోటి నటీమణులు కూడా అందులో నటించడానికి ఆసక్తి చూపేవారు కాదని, బైటి నుండి కళాకారులు సపోర్ట్ చేయరని,మిత్రుల కంటే శత్రువులే ఎక్కువ తయారు అవుతారని, అయినా ఆటుపోట్లను తట్టుకుని నిలబడి సంస్థను క్రమశిక్షణతో నడిపించానని, నటనపట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారితో నాటక ప్రదర్శనలు ఇప్పించానని ఆమె చెప్పారు.
నిజమైన అభిమానంతో సహకరించిన శ్రీ జయా ఆర్ట్స్ సంస్థ సభ్యులకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. 
తనకు ఆదర్శంగా నిలిచిన గురువులకు, తనను తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు డా. శ్రీజ కృతజ్ఞతలు తెలిపారు.
ఇంతకాలం నాటక రంగానికి సేవలు అందించిన తాను ఈ నూతన సంవత్సరం నుండి సినీ రంగంలో రచయిత్రిగా, దర్శకురాలిగా అడుగులు వేయబోతున్నట్లు ఇప్పటి వరకూ 123 చిత్రాలకు అసోసియేట్ రైటర్ గా, 5 చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా, 400 కు పైగా చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసిన అనుభవంతో సినీ రంగంలో ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు, అందులో కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా పోరాడి విజయం సాధిస్తాననే నమ్మకం , ఆత్మవిశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.