రేడియంట్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న డా.శ్రీజ సాదినేని

రేడియంట్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న డా.శ్రీజ సాదినేని
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అని పెద్దలు అన్నారు. ఆమాటను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగితే మనం కూడా ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తామని ప్రముఖ సినీ,టీవీ, రంగస్థల నటి, రచయిత్రి, దర్శకురాలు డా.శ్రీజ సాదినేని తెలిపారు. ముప్ఫై మూడు తెలుగు నాటకాలకు దర్శకత్వం వహించిన తొలి తెలుగు మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించి రేడియంట్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నారు డా.శ్రీజ సాదినేని. ఈ సందర్భంగా ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 
ప్రతి అవమానాన్ని అవకాశంగా మలచుకున్నాను,
ప్రతి అపజయాన్ని విజయానికి పునాదిగా మార్చుకున్నానని, ఈ విజయం వెనుక తాను ఎదుర్కొన్న ఎన్నో సవాళ్ళను , వాటిని అధిగమించి విజయ పతాకం ఎగురవేసిన వైనాన్ని మీడియాతో పంచుకున్నారు. బాలనటిగా ఇరవై తొమ్మిది సంవత్సరాల క్రితం రంగస్థలంలో అడుగు పెట్టిన తాను అనతికాలంలోనే ఎందరో ప్రముఖ దర్శకులతో నాటకాలలో నటించి వందల నాటకాలను వేలలో ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలతో పాటు మూడు వేలకు పైగా 
అవార్డులను అందుకున్నానని, నటిగా మాత్రమే ఆగిపోకుండా దర్శకురాలిగా కూడా చిన్నవయసు లోనే తన ప్రతిభను ప్రదర్శించడం ప్రారంభించి సాంఘిక, పద్య నాటకాలకు, నాటికలకు సారథ్యం వహించి, ముప్ఫై మూడు నాటకాలకు దర్శకత్వం వహించిన తొలి తెలుగు మహిళా దర్శకురాలిగా రేడియంట్ టాలెంట్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్నానని, తన కంటే వయసులో ఎంతో పెద్దవారికి కూడా తన నాటకాలలో పాత్రలు ఇచ్చి వారితో  నటింపజేసి ఆ నాటకాలను సక్సెస్ చేయగలిగానని, ఇది కేవలం తన ఒక్కరి విజయమే కాదని, ఇందుకు సహకరించిన తన సమాజంలోని నటీ నటులు, సాంకేతిక నిపుణులు అందరి సమిష్టి కృషి అని డా. శ్రీజ చెప్పారు , ఈ సందర్భంగా వారందరికీ కృతజ్ఞతలు  తెలిపారు. ఇప్పటివరకు తను దర్శకత్వం వహించిన ఈ నాటిక, నాటకాలలో ప్రముఖ రచయితల రచనలతో పాటు తాను స్వయంగా రచించిన నాటికలు నాటకాలు కూడా ఉండడం సంతోషంగా ఉందని శ్రీజ అన్నారు. అయితే అనుకున్నంత తేలికగా ఈ విజయం సాధ్యం కాలేదని ఎన్నో అవమానాలను ఎదుర్కున్నానని, అపజయాలను కూడా చవి చూశానని అయితే వాటినే తన విజయాలకు నిచ్చెనగా మలచుకుని ముందుకు సాగానని, తనకు తానే స్ఫూర్తిగా అడుగులు ముందుకు వేసి ఈ స్థాయికి రాగలిగాను అని ఇలాంటి ధైర్యం, తెగువ తనకు నేర్పిన తన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు డా. శ్రీజ. అడుగు వేయగానే విజయం చేతికి అందదు. అపజయాలు ఎన్ని ఎదురైనా, అవమానాలు ఎన్ని సార్లు చవిచూసినా ధైర్యాన్ని వదలకుండా ముందుకు సాగితే సక్సెస్ కచ్చితంగా వస్తుందని అందుకు తగిన ఆత్మస్థైర్యాన్ని ఆడపిల్లలకు ప్రతి తల్లి దండ్రులు అందించాలని అప్పుడే ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా దూసుకు పోగలరని డా.శ్రీజ తెలిపారు. ఈ సందర్భంగా తనను అభినందించిన ప్రముఖులకు, మీడియా ప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.