సేంద్రియ ఆహారం దివ్యౌషధం

సేంద్రియ ఆహారం దివ్యౌషధం
సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీరామ రెడ్డి 
  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా రైతులకు అవగాహన సదస్సు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా పండించిన పంటలను మానవాళి ఆహారంగా తీసుకుంటే అవి దివ్యౌషధంగా పనిచేస్తాయని సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీరామ రెడ్డి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వారి ఆర్థిక సహకారంతో ‘‘ఎంపవరింగ్‌ ఫార్మర్స్‌ ఆన్‌ ఆర్గానిక్‌ ఎన్‌రిచ్‌మెంట్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ హార్టికల్చరల్‌ క్రాప్స్‌ ( ఈఎఫ్‌వోఈఏహెచ్‌సీ)’’ అనేఅంశంపై రైతులకు అవేర్‌నెస్‌ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. ఆర్గానిక్‌ పంటలపై జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి యూనివర్సిటీ దత్తగ్రామాలైన వేజండ్ల, వడ్లమూడి, సుద్దపల్లి గ్రామాల నుంచి రైతులు హాజరయ్యారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్‌లోని సహస్ర క్రాప్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.శ్రీరామ రెడ్డి మాట్లాడుతూ రసాయనాలు వినియోగించకుండా పూర్తిగా సేంద్రియ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో కూరగాయలు, పండ్లు, తిండి గింజలు, పప్పు ధాన్యాలు సాగుచేయడానికి అదనంగా శ్రమపడాల్సి వస్తుందన్నారు. అయితే ఆ శ్రమ వృథాగా పోదన్నారు. సేంద్రియ ఆహారోత్పత్తులలో స్థూల, సూక్ష్మ పోషకాలతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచే ‘‘యాంటీ ఆక్సిడెంట్స్‌’’ వంటి విశిష్ట పోషకాలు అత్యధిక మోతాదులో ఉంటాయన్నారు. రసాయనిక పద్ధతుల్లో పండించే వరి బియ్యం, దొండ, బెండ, కాలీఫ్లవర్‌లో వ్యాధి నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్స్‌ ఏమీ ఉండవన్నారు. సేంద్రియ ఆహారోత్పత్తుల ద్వారా పండించే వరిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ వేల రెట్లు అధికమని వెల్లడించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.