భవిష్యత్‌ మీద ఆశ కలిగించాలి

భవిష్యత్‌ మీద ఆశ కలిగించాలి
- ఐఏఎన్‌ఎల్‌పీ ప్రెసిడెంట్‌ విశేష్‌
- విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ప్రారంభమైన మూడు రోజుల వర్క్‌షాప్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థులకు సమస్యలు ఎదురైనప్పుడు అధ్యాపకులుగా, కౌన్సిలర్లుగా వారికి భవిష్యత్‌ మీద ఆశ కలిగించాలని ఐఏఎన్‌ఎల్‌పీ ( ఇంటర్నేషనల్‌ న్యూరో లింగ్విస్టిక్‌ ప్రోగ్రామ్‌) ప్రెసిడెంట్‌ విశేష్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని సోషల్‌ సైన్సెస్‌ అండ్‌ హుమానిటీస్, అకాడమీ ఫర్‌ ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్, ఐక్యూఏసీ, ఏపీఏ ఇండియాల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ఎంపవరింగ్‌ త్రూ ప్రివెన్షన్‌ – ప్రొఫెషనల్‌ ట్రైనింగ్‌ ఆన్‌ లైఫ్‌–సేవింగ్‌ ఎడ్యుకేషన్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు అధ్యాపకులకు, కౌన్సిలర్‌లకు నిర్వహించే  వర్క్‌షాప్‌ను ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఏఎన్‌ఎల్‌పీ ప్రెసిడెంట్‌ విశేష్‌ మాట్లాడుతూ అధ్యాపకులుగా మీరందరూ విద్యార్థులను ఎప్పుడు కూడా సరికొత్తగా ఆలోచించే విధంగా  ప్రోత్సహించాలన్నారు. అలా చేయనట్లైతే మెదడు చెడు ఆలోచనలవైపు దృష్టిమరలుతుందన్నారు. తరగతిగదిలో ఉపాధ్యాయుడు లీడర్‌గా మారి తన ఫిలాసఫీని, తన ఆదర్శాలను విద్యార్థుల ముందుంచి వారిని గొప్ప ఆవిష్కర్తలుగా తయారుచేయాలని సూచించారు. తరగతిగదిలో పాఠ్యాంశాలను బోధించేటప్పుడు అధికార గర్వం కన్నా ప్రజాస్వామిక దృక్పథం ప్రధానమన్నారు. ఉపాధ్యాయుడు అనే భావనకు బదులుగా తరగతిగదిలో తాను భాగస్వామిననే భావన కలిగి ఉండాలని పేర్కొన్నారు. తరగతిగదిలో ఉన్న విద్యార్థి మెరుగుపడటంతో పాటు.. తాను కూడా వారితో పాటు మెరుగుపడుతున్నాననే భావనతో పనిచేస్తే ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందుతారన్నారు. తనకంటే గొప్పవారిగా తన విద్యార్థులను తయారుచేయాలనే కోరిక ప్రతి ఉపాధ్యాయునిలో తప్పనిసరిగా ఉండాలన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన జీవీఏ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైకాలజీ ఫౌండర్, క్లినికల్‌ సైకాలజిస్ట్‌ డాక్టర్‌ శ్రీకాంత్‌ గోగి మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థుల సమస్యలను గుర్తించడంతో పాటు వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని సునిశితంగా పరిష్కరించాలన్నారు. జీవితంలో ప్రతి విద్యార్థి కూడా కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అటువంటి సందర్భాలలో విద్యార్థులు ఆందోళన చెంది, ఒత్తిడికి గురై సమస్యలను పరిష్కరించలేమనే నిరాశకు గురికాకుండా పరిష్కారానికి గల అనువైన పద్ధతులను వెతికేలా ట్రైనింగ్‌ ఇవ్వాలన్నారు. విద్యార్థులు ధైర్యంతో ముందుకు సాగితే జీవితంలో ఏదైనా సాధించగలరని నమ్మకాన్ని వారిలో కలిగించాలన్నారు. విద్యార్థుల ఎదుగదలలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో ఏపీఏఐ నేషనల్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ క్రిష్ణ భరత్, నేషనల్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జీ.రాజేశ్వరరావు, నేషనల్‌ సెక్రటరీ రవిభార్గవ్, ఏపీఏఐ ఏపీ కమిటీ ప్రెసిడెంట్‌ ఎమ్‌పీ జానకిరామ్, వైస్‌ ప్రెసిడెంట్‌ పీవీవీ ప్రసాద్, ట్రెజరర్‌ అత్తోట తేజ, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.