ఈ నెల 6 నుంచి విజ‌య‌వాడ‌లో భార‌త్ రంగస్థల మ‌హోత్స‌వ్‌

ఈ నెల 6 నుంచి విజ‌య‌వాడ‌లో భార‌త్ రంగస్థల మ‌హోత్స‌వ్‌
- 11వ తేదీ వ‌ర‌కు తుమ్మ‌ల‌ప‌ల్లి క‌ళాక్షేత్రంలో నాట‌కాల ప్ర‌ద‌ర్శ‌న‌
- నాట‌క‌రంగ ప్రేక్ష‌కులు, క‌ళాకారులు స‌ద్వినియోగం చేసుకోవాలి
- ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: ఈ నెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వ‌ర‌కు విజ‌య‌వాడ‌లో 23వ‌ భార‌త్ రంగస్థల మ‌హోత్స‌వ్‌-ఇంటర్నేష‌న‌ల్ థియేట‌ర్ ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా-2024 కింద నాట‌కాల ప్ర‌ద‌ర్శ‌న జ‌ర‌గ‌నుంద‌ని.. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వ‌ర్యంలో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు తెలిపారు.
శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు.. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు రేగుళ్ల మ‌ల్లికార్జున‌రావు, జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్‌, విజ‌య‌వాడ మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, విజ‌య‌వాడ ఆర్‌డీవో బీహెచ్ భ‌వానీ శంక‌ర్‌, డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, డిప్యూటీ క‌లెక్ట‌ర్ కిర‌ణ్మ‌యి త‌దిత‌రుల‌తో క‌లిసి భార‌త్ రంగ‌స్థ‌ల మ‌హోత్స‌వ్‌ పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ డిల్లీరావు మాట్లాడుతూ రంగ‌స్థ‌ల కార్య‌క‌లాపాల‌ను ప్రోత్స‌హించేందుకు నేష‌న‌ల్ స్కూల్ ఆఫ్ డ్రామా (ఎన్ఎస్‌డీ) దేశ విదేశాల నుంచి 100 నాట‌కాల‌ను ఎంపిక‌చేసి దేశ వ్యాప్తంగా వివిధ న‌గ‌రాల్లో ఫిబ్ర‌వ‌రి 1 నుంచి 21 వ‌ర‌కు ప్ర‌ద‌ర్శ‌న‌లు ఏర్పాటు చేస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్ర‌భుత్వ సంయుక్త ఆధ్వ‌ర్యంలో ఈ నెల 6 నుంచి 11 వ‌ర‌కు విజ‌య‌వాడ‌, తుమ్మ‌ల‌ప‌ల్లి వారి క్షేత్ర‌య్య క‌ళాక్షేత్రంలో నాట‌క ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉంటాయ‌ని వివ‌రించారు. ప్ర‌తిరోజు సాయంత్రం 6 గంట‌ల నుంచి నాట‌క ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌ని.. ఈ అవ‌కాశాన్ని నాట‌క‌రంగ ప్రేక్ష‌కులు, క‌ళాకారులు వినియోగించుకోవాల‌ని క‌లెక్ట‌ర్ డిల్లీరావు కోరారు. రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాల‌కులు ఆర్‌.మ‌ల్లికార్జున‌రావు మాట్లాడుతూ ఫిబ్ర‌వ‌రి 6వ తేదీన మై రి మె కా సె క‌హు, 7న గ‌దాయుద్ధ , 8న ఎండ్ గేమ్, 9న ఖోనా, 10న క‌హాన్ క‌బీర్, 11వ తేదీన అయోధ్య కాండ నాట‌కాల ప్ర‌ద‌ర్శ‌న ఉంటుంద‌ని తెలిపారు.