కన్నుల పండువగా విజ్ఞాన్ మహోత్సవం

కన్నుల పండువగా విజ్ఞాన్ మహోత్సవం

*కళతో ప్రజలను చైతన్యపరిచా : చిందు యక్షగానం ఆర్టిస్ట్‌ *గడ్డం సమ్మయ్య (పద్మశ్రీ అవార్డు గ్రహీత–2024)
*సహజ శక్తులను ఉపయోగించాలి : ఇండియన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ రఘు కుంచె
*వారే త్వరగా స్థిరపడుతారు : విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
ఘనంగా ప్రారంభమైన విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌
అద్భుత ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులు
వివిధ రాష్ట్రాల నుంచి 50 వేల మందికి పైగా హాజరైన విద్యార్థులు
*చూసేందుకు రెండు కళ్లు చాలనంత... రికార్డులు హోరెత్తంత.. గుండెల్లో స్ఫూర్తి నింపేంత.. మది పులకించేంత.. ఆటల మందారాలను చూసి మురిసిపోయేంత.. తుళ్లింతలు.. కేరింతలతో మూడురోజుల పాటు విద్యార్థుల సందడితో కళకళలాడే   జాతీయ స్థాయి విజ్ఞాన్స్‌ మహోత్సవ్‌–2కే24 పండుగను చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో బుధవారం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. విజ్ఞాన్స్‌ మహోత్సవాన్ని ఈ ఏడాది వినూత్నంగా నిర్వహించడంతో జాతీయస్థాయిలో క్రికెట్‌ చాంపియన్‌షిప్‌ పోటీలను ప్రారంభించారు.

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జాతీయ స్థాయి విజ్ఞాన్‌ మహోత్సవం గురువారం వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిందు యక్షగానం ఆర్టిస్ట్‌ గడ్డం సమ్మయ్య (పద్మశ్రీ అవార్డు గ్రహీత–2024) మాట్లాడుతూ చిందు యక్షగానం కళతో వేలాది మంది ప్రజలను చైతన్యపరిచానని అన్నారు. అతి చిన్నవయస్సు నుంచే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలైన మద్యపాన నిషేధం. అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, హెచ్‌ఐవీ వంటి కార్యక్రమాలపైన వేలాది ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం తెచ్చానన్నారు. అర్జునుడు, శ్రీకృష్ణుడు, కీచకుడు, కంసుడు, హిరణ్యకస్యపుడు, రావణాసురుడు, ప్రహ్లాదుడు, మార్కేండేయుడు వంటి పాత్రలు ధరించానన్నారు. ఆలిండియా రేడియో, ఆకాశవాణి, దూరదర్శన్‌ ద్వారా కూడా అనేక ప్రదర్శనలు ఇచ్చానని విద్యార్థులకు తెలియజేసారు. పలువురు ప్రముఖుల చేతుల మీదుగా వివిధ రకాల అవార్డులను కూడా స్వీకరించానని వెల్లడించారు. గ్రామీణ ప్రాంత కళైన చిందు యక్షగానానికి నేను చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు చదువుకే పరిమితం అవ్వకుండా యోగ, సంగీతం, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించడంలో ముందు వరుసలో ఉండాలన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చ్‌ ఫాస్ట్‌ను నిర్వహించారు.

సహజ శక్తులను ఉపయోగించాలి : ఇండియన్‌ మ్యూజిక్‌ కంపోజర్‌ రఘు కుంచె
యువతలో అంతర్లీనంగా సృజనాత్మక శక్తులు ఉంటాయని, ఈ సృజనాత్మకతను వెలికి తీయడానికే ఈ మహోత్సవాలన్నారు. చదువు అంటే పుస్తకాలు ఒక్కటే కాదని, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాఠ్యాంశాలేనన్నారు. యువత తమ సహజ శక్తులను దేశ ప్రయోజనాలకు ఉపయోగించాలన్నారు. యువత కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనన్నారు. విలువలతో కూడిన విద్య జీవితాన్ని ఉన్నత స్థానంలో నిలబెడుతుందని చెప్పారు. దేశానికి నైపుణ్యం ఉన్న యువత అవసరం ఎంతో ఉందని, అభివృద్ధి చెందిన సమాజ నిర్మాణంలో వారు భాగస్వాములు కావాలని సూచించారు. 

వారే త్వరగా స్థిరపడుతారు : విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ గడిచిన 20 సంవత్సరాల నుంచి ఎప్పుడూ ఆగకుండా విజ్ఞాన మహోత్సవాన్ని నిర్విరామంగా చేస్తున్నామని తెలియజేసారు. విద్యార్థులు ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నట్లైతే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారని తెలిపారు. మహోత్సవాలను నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఒకరితో మరొకరు ఎలా మెలగాలి? బృంద సమూహంగా ఎలా పనిచేయాలనే విషయాలు తెలుస్తాయన్నారు. ఎవరైతే ఇటువంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారో వారే అందరికంటే ముందుగా జీవితంలో స్థిరపడుతారని పేర్కొన్నారు.

75 ఈవెంట్ల నిర్వహణ
విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహోత్సవ్‌లో మొత్తం 75 ఈవెంట్లను ప్రారంభించారు. తొలుత నిర్వహించిన స్పోర్ట్స్‌ ఫీట్‌లో వాలీబాల్, బాస్కెట్‌బాల్, కబడ్డీ, టేబుల్‌ టెన్నిస్, చెస్, అథ్లెటిక్స్, త్రోబాల్‌ తదితర క్రీడాంశాల్లో జాతీయస్థాయిలో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. వీటితోపాటు కల్చరల్స్, లిటెరరీ, ఫైన్‌ ఆర్ట్స్, ఫ్యాషన్, మ్యూజిక్, డాన్స్, స్పాట్‌లైట్, థియేటర్‌ ఆర్ట్స్‌ వంటి తదితర రంగాలను కలుపుకుని సాంకేతిక, సాంస్కృతికాంశాల్లో జాతీయస్థాయిలో పోటీలను ప్రారంభించారు. పారా అథ్లెటిక్స్‌ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ ఈవెంట్స్‌ను ప్రారంభించారు.

అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
మహోత్సవ్‌–2కే24 సంబరాల్లో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి. కళాకారులు పలు నృత్య రూపకాలకు అనుగుణంగా నర్తించి మంత్రముగ్ధుల్ని చేశారు. ముఖ్యంగా జానపద, శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ఓలలాడించాయి. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే ధ్యానం, యోగాతోనే సాధ్యమని చూపించిన నృత్య ప్రదర్శన విద్యార్థులను ఆకట్టుకుంది. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘‘ క్రాకర్స్‌ షో’’ ఎంతగానో ఆకట్టుకుంది. కార్యక్రమంలో విజ్ఞాన్‌ సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.