కామోత్సవ దహనం పుస్తకావిష్కరణ


కామోత్సవ దహనం పుస్తకావిష్కరణ
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఏ రూపంలో అశ్లీలత ఉన్నా దాన్ని తీవ్రంగా ప్రతిఘటించవలసిన అవసరం ఉందని అశ్లీలతా ప్రతిఘటన వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, ప్రజాసాహితి పత్రిక సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు అన్నారు. అభ్యుదయ రచయితల సంఘం, అశ్లీలతా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో స్థానిక కొత్తపేటలోని సి.పి.ఐ. కార్యాలయంలో సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో అశ్లీలతా ప్రతిఘటన వేదిక వ్యవస్థాపకుడు ఈదర గోపీచంద్ సంపాదకత్వంలో వెలువడిన కామోత్సవ దహనం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించి అనంతరం జరిగిన సభకు అధ్యక్షత వహించి ప్రసంగించారు. రవిబాబు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ 1987 ప్రాంతంలో ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించగా ఒక వారపత్రికలో ధారావాహికగా వచ్చిన కామోత్సవ్ అనే అశ్లీల రచనను ప్రతిఘటిస్తూ వ్యాసాలు రాసినందుకు తమపై కేసులు నమోదు చేసినప్పటికీ అవి వీగిపోయాయని రవిబాబు అన్నారు. ఈదర గోపీచంద్ మాట్లాడుతూ అప్పట్లో ధారావాహికగా వచ్చిన ఈ రచనను గుంటూరు శేషేంద్రశర్మ తనయుడు ప్రస్తుతం నవల రూపంలో అందుబాటులో తెచ్చారని ఆ కారణంగా అందులో ఉన్న అశ్లీలతను నేటి తరం వారికి తెలియజెప్పాలని అప్పట్లో ఈ రచనను వ్యతిరేకిస్తూ వచ్చిన వ్యాసాలు, దినపత్రికలలోని ప్రచురితమైన పలు అంశాలను క్రోడీకరించి కామోత్సవ దహనం పేరుతో పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 26 అశ్లీలతా ప్రతిఘనట వేదిక ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించినట్లు ఈదర గోపీచంద్ తెలిపారు. అశ్లీల ప్రతిఘనట వేదిక రాష్ట్ర కార్యదర్శి బీరం సుందరరావు మాట్లాడుతూ నేడు సెల్ఫోన్లలో వస్తున్న అశ్లీల చిత్రాలు యువతను పెడత్రోవ పట్టిస్తున్నాయని, వాటిని ప్రతిఘటించవలసిన అవసరం ఉందన్నారు. సభలో అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగా, విశ్రాంత ప్రొఫెసర్ బి. లలితానంద ప్రసాద్, ఏఐటియుసి సీనియర్ నేత పరుచూరి వెంకటేశ్వరరావు, రచయితలు కె. నారాయణమూర్తి, ఐనాల మల్లేశ్వరరావు తదితరులు ప్రసంగించారు.
55