కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరణ

*కేంద్ర సహాయ మంత్రిగా పెమ్మసాని బాధ్యతలు స్వీకరణ*
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
 ప్రజా సేవకు అవకాశం కల్పించిన నరేంద్ర మోడీ, చంద్రబాబుకు కృతజ్ఞతలు : పెమ్మసాని
'ప్రజలు, నాయకుల అంచనాలకు తగిన విధంగా పనిచేస్తాను. ప్రజా సమస్యలను పరిష్కరించే ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టను.' అని గ్రామీణ అభివృద్ధి, కమ్యూనికేషన్స్ కేంద్ర సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలోని స్థానిక సంచార్ భవన్ లో కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రిగా గురువారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోకి అడుగుపెట్టిన పెమ్మసాని సంబంధిత అధికారులు ఆత్మీయంగా ఆహ్వానించారు. బాధ్యత స్వీకరణ అనంతరం అధికారులతో ఆయన మాట్లాడుతూ శాఖ పరమైన వివరాలు కార్యాలయ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే క్రమంలో అందరి సహకారం ఉండాలని, మన మేధస్సును రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఉపయోగించాలని అధికారులతో మాట్లాడుతూ కోరారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ తనను, తన వ్యక్తిత్వాన్ని నమ్మి ఇంతటి బాధ్యతను అప్పగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతిభావంతులైన జ్యోతిరాధిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహన్ లతో కలిసి పనిచేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. రాష్ట్ర, దేశ ఖ్యాతిని దశదిశలా ఇనుమడింప చేసేలా తన పనితీరు ఉండబోతుందని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో సంబంధిత శాఖ ఉన్నతాధికారులు, అధికారులు పాల్గొన్నారు.