విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – సీడాక్‌ల మధ్య అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – సీడాక్‌ల మధ్య అవగాహన ఒప్పందం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ – బెంగుళూరులోని సీడాక్‌ ( సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్డ్స్‌ కంప్యూటింగ్‌) ల మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందని శనివారం యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీడాక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎస్‌డీ.సుదర్శన్‌తో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ఈ అవగాహన ఒప్పందం వలన విద్యార్థులకు, అధ్యాపకులకు రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, ప్రోడక్ట్‌ డెవలప్‌మెంట్, ట్రైనింగ్‌ అండ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రంగాలలో ప్రత్యేక శిక్షణ లభిస్తుందన్నారు. అంతేకాకుండా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిసియల్‌ ఇంటెలిజెన్స్, హై పెర్ఫార్మెన్స్‌ కంప్యూటింగ్, బిగ్‌డేటా అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, ఎంబెడెడ్‌ సిస్టమ్స్, రోబోటిక్స్, పవర్‌ ఎలక్ట్రానిక్స్, వీఎల్‌ఎస్‌ఐ, ఆర్‌ఎఫ్‌ మైక్రోవేవ్, డ్రోన్‌ టెక్నాలజీ,  ఎలక్ట్రికల్‌ టెక్నాలజీలను మరింత చేరువ చేస్తామన్నారు. విద్యార్థులకు ఎంపికచేయబడిన టెక్నాలజీలలో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రామ్‌లను కూడా అందిస్తామన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా మైనర్‌ లేదా క్రెడిట్‌ కోర్సులను వారి సిలబస్‌లో చేర్చుతామన్నారు. ఇండస్ట్రీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆవిష్కరణలను ప్రోత్సహించడంతో పాటు మా విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రాక్టికల్‌గా అనుభవాలను కల్పిస్తామన్నారు. ఈ సందర్భంగా సీడాక్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ డాక్టర్‌ ఎస్‌డీ.సుదర్శన్‌ మాట్లాడుతూ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను సరికొత్త టెక్నాలజీల వైపు ప్రోత్సహించడంతో పాటు వారికి ఆయా రంగాలలో తర్ఫీదనివ్వడమే ఈ ఒప్పందం లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సీడాక్‌ సైంటిస్ట్‌–ఎఫ్‌ హరిబాబు, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, వర్సిటీలోని ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.