పరిశోధనలు చేస్తేనే ఉజ్వల భవిత

పరిశోధనలు చేస్తేనే ఉజ్వల భవిత
 ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సీ.శాస్త్రి
 విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో వైభవంగా ముగిసిన అంతర్జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్:
గణిత రంగంలో పరిశోధనలు చేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సీ.శాస్త్రి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో  ‘‘ ఎమర్జింగ్‌ ట్రెండ్స్‌ ఇన్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌’’ అనే అంశంపై మూడు రోజుల పాటు హైబ్రిడ్‌ మోడ్‌లో నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను శనివారం వైభవంగా ముగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ సీ.శాస్త్రి మాట్లాడుతూ విభిన్న వర్గాల వినియోగదారులు, వారి అభిరుచులు, వారి అవసరాలను గుర్తించే క్రమంలో సమాచారాన్ని సేకరించడం... వాటిని క్రోడీకరించి వర్గీకరిస్తేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. మేథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌ రంగాలలో పరిశోధనలు పెరిగినట్లైతే మానవాళికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు. దీనిపై యువత దృష్టి సారించాలన్నారు. కార్యక్రమానికి ఆన్‌లైన్‌లో ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని నోవార్టిస్‌ కంపెనీ డేటా అనలిస్ట్‌ డాక్టర్‌ ఎం.వేణుగోపాల రావ్‌ మాట్లాడుతూ ఇంజినీరింగ్‌ విద్యార్థులు వారి బ్రాంచిలకు సంబంధించిన సబ్జెక్టులపైనేకాకుండా ప్రాథమిక సైన్స్, మేథమేటిక్స్‌ విషయాలపై అవగాహనతో ఉంటే ఎంతో మంచిదని తెలిపారు. భవిష్యత్తులో ఈ విజ్ఞానం ఎంతగానో ఉపయోగపడుతుందని సూచించారు. మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ప్రాబబిలిటీ వంటి స్పెషలైజేషన్లు చదివి స్టాటిస్టికల్‌ అనాలిసిస్‌ సిస్టమ్, హడూప్‌ వంటి తదితర సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామ్‌లలో శిక్షణ పొందితే డేటా సైంటిస్ట్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.