భవిష్యత్‌ మెకానికల్, సివిల్‌ రంగాలదే!

భవిష్యత్‌ మెకానికల్, సివిల్‌ రంగాలదే!
- షార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ గ్రూప్‌ డైరక్టర్‌ పీ.గోపీక్రిష్ణ 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
రాబోవు కాలంలో ఆటోమేషన్‌ రంగంలోని మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌ రంగాల విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని షార్‌ ( శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ ) మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ గ్రూప్‌ డైరక్టర్‌ పీ.గోపీక్రిష్ణ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకు ముఖ్య అతిథిగా విచ్చేసిన షార్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌ గ్రూప్‌ డైరక్టర్‌ పీ.గోపీక్రిష్ణ మెకానికల్, సివిల్‌ ఇంజినీరింగ్‌ అధ్యాపకులు, విద్యార్థులకు ప్రత్యేక అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకట్రానిక్స్, రోబోటిక్స్, స్పేస్‌ క్రాఫ్ట్‌ డిజైన్‌లో గల ఉన్నత సాంకేతిక నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. కోర్‌ ఇంజినీరింగ్, స్పేస్‌ టెక్నాలజీ రంగాలలో గల ఉద్యోగ అవకాశాలను విద్యార్థులతో పంచుకున్నారు. తయారీ రంగంలో మిగిలిన ప్రపంచ దేశాలు ప్రస్తుతం వెనుకంజలో ఉన్నాయని, మన దేశం తయారీ రంగంలో అగ్రగామిగా నిలవడానికి ఇదే సరైన సమయమన్నారు. రాబోయే రోజుల్లో రోబోటిక్స్, ప్రోడక్ట్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్, మెడికల్‌ ఇనుస్ట్రుమెంటేషన్‌ కీలకంగా మారనున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆటోమొబైల్స్, వ్యవసాయం, హాస్పిటల్స్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ అన్ని రంగాలలోను రోబోలను వినియోగిస్తారని తెలిపారు. వాహనాలను కూడా రోబోలే నడుపుతాయని పేర్కొన్నారు. ప్రపంచ అవసరాలకు తగ్గట్లు విద్యార్థులు పరిశోధనలకు పూనుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు నలుగురు అంతకు మించి సమూహాలుగా ఏర్పడి నూతన ఆవిష్కరణలు చేపట్టాలని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.