విజ్ఞాన్స్‌లో ఘనంగా లావు రత్తయ్య పుట్టినరోజు వేడుకలు

విజ్ఞాన్స్‌లో ఘనంగా లావు రత్తయ్య పుట్టినరోజు వేడుకలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య జన్మదిన వేడుకలను ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్‌ విద్యా సంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు మాత్రమే తారతమ్య భేధాలు లేకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారని అన్నారు. విద్యార్థులందరూ జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తే తాను ఇంకా ఎక్కువ సంతోషిస్తామని తెలియజేశారు. విద్యార్థులతో తనకున్న అనుబంధం మాటల్లో వర్ణించలేనిదని, అందుకోసమే ప్రతి సంవత్సరం తన పుట్టినరోజును ఇలా విద్యార్థుల మధ్య జరుపుకోవడానికి ఇష్టపడతానని పేర్కొన్నారు. సాధారణ ఆలోచనలతో కాకుండా క్రియేటివ్‌గా ఆలోచిస్తేనే విజయం సాధించగలరని విద్యార్థులకు సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే విద్యార్థులు సరైన దిశగా ఎదగలగరనే సిద్ధాంతాన్ని తాను మొదటి నుంచి నమ్ముతున్నానని చెప్పారు. అదే సూత్రాన్ని తాము ప్రతి పాఠశాల, కళాశాలల్లో అమలు చేస్తున్నామని తెలిపారు.  కాబట్టే తమ విద్యార్థులు ఎన్నో అద్భుతాలు చేయగలుగుతున్నారని పేర్కొన్నారు. తమ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విజ్ఞాన్‌ సిబ్బంది కురిపిస్తున్న అభిమానం వల్లనే తాను దినదినం మరింత ఉత్సాహంగా శ్రమించడానికి కావాల్సినంత శారీరక శక్తిని, మానసిక శక్తిని ఇస్తున్నాయన్నారు. వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు. విజ్ఞాన్‌ సంస్థలు ఇంత అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరూ ఇష్టపూర్వకంగా, సంతోషంగా పనిచేయడం వల్లనే సాధ్యమైందన్నారు. జీవితంలో ఎవరైనాసరే ఉన్నత స్థాయికి చేరాలంటే వారు ఎదుర్కొనే కష్టాలు, చేసే త్యాగాలను బట్టే వాళ్లకు ఫలితం లభిస్తుందన్నారు. అనంతరం పుట్టిన రోజు కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్‌పర్సన్‌ బీ.రుద్రమదేవి, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌  ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, లారా ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కే.ఫణీంద్రకుమార్, ఫార్మసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ పీ.శ్రీనివాసబాబు, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జే.మోహన్‌రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.