విజ్ఞాన్‌లో ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

-మార్పు విద్యార్థులతోనే సాధ్యం
 -విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌      పీ.నాగభూషణ్‌
 -విజ్ఞాన్‌లో ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
దేశం అభివృద్ధి చెందాలన్నా, సమాజంలో మార్పు మొదలవ్వాలన్నా విద్యార్థులతోనే సాధ్యమని విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ, విజ్ఞాన్‌ లారా, ఫార్మసీ, జూనియర్‌ కళాశాలలో ఆధ్వర్యంలో 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంద్రాగస్టు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ దేశం ఎంత ప్రగతి సాధించినా... ఇంకా చేయాల్సింది, ప్రయాణించాల్సింది మిగిలే ఉంటుందన్నారు. విద్యార్థుల్లో ఎంత సృజనాత్మకత ఉంటే దేశం అంత వృద్ధిలోకి వస్తుందన్నారు. వచ్చే 10 నుంచి 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచ దేశాలలో అత్యంత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందన్నారు. గతాన్ని విశ్లేషించి వర్తమానాన్ని అవగతం చేసుకుని, దేశ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి గల అవకాశాలను విద్యార్థులు పరిశీలించాలన్నారు. రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేశారని, వారు ఆరోజు త్యాగం చేయడం వలనే నేడు మనం స్వాతంత్య్రాన్ని అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. వారి త్యాగాలను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుంటే మీలో కూడా జాతీయ భావం పెంపొందుతుందన్నారు. నేటి యువత స్వేచ్ఛను విపరీత ధోరణికు వినియోగించకుండా బాధ్యతతో నిర్వహించాలన్నారు. అనంతరం వారం రోజుల స్వాతంత్య్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన  డిబేట్, మాక్‌ పార్లమెంట్, క్విజ్, డ్రాయింగ్, హ్యాండ్‌ పేయింటింగ్, ఎలక్యూషన్, షార్ట్‌ఫిల్మ్‌లో సత్తాచాటిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. ఎన్‌సీసీ విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్,  రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు పాల్గొన్నారు.