విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో కేంబ్రిడ్జి అవగాహన ఒప్పందం

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో కేంబ్రిడ్జి అవగాహన ఒప్పందం
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇంగ్లాండ్‌లోని ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ఇంగ్లీష్‌ అసెస్‌మెంట్‌ విభాగం వారు  చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీతో లింగ్వాస్కిల్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లో అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) చేసుకున్నారని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఓయూకు సంబంధిన అవగాహన పత్రాలను కేంబ్రిడ్జి యూనివర్సిటీ సౌత్‌ ఏసియా రీజనల్‌ డైరక్టర్‌ అరుణాచలం, సౌత్‌ ఇండియా డీజీఎం కార్తి సుబ్రమణియన్‌కు విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ అందించారు. ఈ సందర్భంగా వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ కేంబ్రిడ్జి యూనివర్సిటీ వారు లింగ్వాస్కిల్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ను ప్రపంచ వ్యాప్తంగా మొట్టమొదటగా తమ యూనివర్సిటీలోనే ప్రయోగాత్మకంగా ప్రవేశ పెడుతున్నారని తెలియజేసారు. అంతేకాకుండా విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో కేంబ్రిడ్జి సెంటర్‌ను, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ను నెలకొల్పి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండస్ట్రీ పార్టనర్స్‌ను, పారిశ్రామికవేత్తలను కేంబ్రిడ్జి వారు ఇక్కడికి తీసుకువచ్చి విద్యార్థులతో ఇంటరాక్ట్‌ అయ్యేలా చేస్తారని పేర్కొన్నారు. పరిశోధనల్లో సహకారం అందించడం, విద్యార్థుల భాషా నైపుణ్యంపై కేంబ్రిడ్జ్‌ సర్టిఫికేషన్‌ పరీక్షల ప్రభావాన్ని అధ్యయనం చేసే ఉమ్మడి ప్రాజెక్ట్‌ ఇప్పటికే పురోగతిలో ఉందని వెల్లడించారు. విద్యార్థుల భాషా నైపుణ్యాలను పెంపొందించడానికి, ఉన్నత స్థాయి శిక్షణ, ధృవీకరణను అందించే మిషన్‌ను మరింత ముందుకు తీసుకువెళుతుందన్నారు. న్యూ లింగ్వాస్కిల్‌ ఆన్‌లైన్‌ పరీక్ష వలన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ టెక్నాలజీ ద్వారా విద్యార్థుల ఆంగ్ల స్థాయిలను తనిఖీ చేయవచ్చునన్నారు. మాడ్యూల్స్‌లో మాట్లాడటం, రాయడం, చదవడం మరియు వినడం అనే నాలుగు భాషా నైపుణ్యాలను పరీక్షిస్తుందన్నారు. కొన్నేళ్లుగా కేంబ్రడ్జి యూనివర్సిటీ నిర్వహిస్తున్న సర్టిఫికేషన్‌ కోర్సులకు తమ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారుని, దాదాపు వంద శాతం మంది ఉత్తీర్ణులవుతున్నారని వెల్లడించారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీ విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న ప్రత్యేక కోర్సుల ఫలితంగా ఇక్కడి విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆంగ్ల భాషను నేర్చుకోగలుగుతున్నారని చెప్పారు. వారికి ఉద్యోగ అవకాశాలు కూడా పుష్కలంగా అందుతున్నట్లు తెలిపారు. ఈ అంశాలన్నింటిని పరిగణలోనికి తీసుకుని కేంబ్రిడ్జి యూనివర్సిటీ అవగాహన ఒప్పందాన్ని చేసుకుందని తెలిపారు. కార్యక్రమంలో కేంబ్రడ్జి కార్పొరేట్‌ రిలేషన్స్‌ రీజనల్‌ మేనేజర్‌ పద్మజ శివకుమార్, ఈఎల్‌టీ మేనేజర్‌ మలికార్జున నాయుడు పచిపాల, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.