నెహ్రూనికేతన్ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు


నెహ్రూనికేతన్ శ్రీ కృష్ణాష్టమి వేడుకలు 
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
శ్రీ కృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ముందస్తు వేడుకలను స్థానిక బోడ్డులోని నెహ్రూనికేతన్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో శనివారం ఉదయం ఘనంగా జరిపారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి పర్యవేక్షణలో నర్సరీ నుండి మొదటి తరగతికి చెందిన బాలురు కృష్ణుని వేషధారణలోను, చిన్నారి బాలికలు గోపికలు, రాధ వేషధారణలో అభినయిస్తూ అందరి ప్రశంసలందుకున్నారు. ముచ్చటగోలిపే చిన్నారుల ముద్దులొలికే పనులతో అందరూ అలౌకిక ఆనందాన్ని పొందారు. చిన్నారులు ఉట్టికొట్టే కార్యక్రమాన్ని చాలా ఉత్సాహంగా నిర్వహించారు. గోపికల వేషధారణ చేసిన చిన్నారులు ఉట్టిని లాగుతుండగా, కృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులు ఎగిరి దాన్ని పగులగొట్టే ఘట్టం కనువిందు చేసింది. పలు పాటలకు చిన్నారులు చేసిన సంప్రదాయ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొందరు చిన్నారులు శ్రీకృష్ణుడి భక్తి పాటలకు ప్రత్యేక నృత్యాలు చేశారు. శ్రీకృష్ణ వేషధారణలో చిన్నారులు పిల్లనగ్రోవితోను, గోపికలు వెన్నకుండలతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బాలబాలికలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.