సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయండి

సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయండి
 - గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ (ఐఏఎస్‌)
-  విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఎన్‌ఎస్‌ఎస్‌ డే ఉత్సవాలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
విద్యార్థులందరూ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేయాలని గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ(ఐఏఎస్‌) పిలుపునిచ్చారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలోని యూఈఏసీ (యూనివర్సిటీ ఎక్స్‌టెన్షన్‌ యాక్టివిటీ కౌన్సిల్‌) విద్యార్థుల ఆధ్వర్యంలో ఎన్‌ఎస్‌ఎస్‌ డేను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ(ఐఏఎస్‌) మాట్లాడుతూ విద్యార్థులందరూ సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించడానికి కృషి చేయాలన్నారు. అంతేకాకుండా సమాజానికి వీలైనంత సేవ చేయాలని, పది మందికి ఉపయోగపడే పనులు చేయాలన్నారు. ఇటీవల విజయవాడలో సంభవించిన వరద సహాయక చర్యల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. అంతేకాకుండా యూనివర్సిటీ పరిధిలోని 5 గ్రామాలను ( శలపాడు, వడ్లమూడి, వీరనాయకునిపాలెం, వేజండ్ల, సుద్దపల్లి) దత్తత తీసుకుని సంవత్సర కాలంలో 107 సామాజిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో విద్యార్థులు పాల్గొనడం వలన సమాజానికి ప్రయోజనం కలగడంతో పాటు విద్యార్థుల వ్యక్తిగత అభివృద్ధికి, వృత్తిపరమైన అవకాశాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చో వివరించారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ సమీప ప్రాంతాల్లోని ప్రజలకు విద్య, ఆరోగ్యం, పరిసర ప్రాంతాలు, కాలుష్యం, సమస్యలను పరిష్కరించడం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులు తమ అనుభవాలను, నాలెడ్జ్, స్కిల్స్, ఇంటెలిజెన్స్, సమయ స్ఫూర్తిను తోటి విద్యార్థుల్లో నింపాలన్నారు. ప్రజలకు ఇంకా ఉపయోగపడే పనులు ఏం చేయచ్చో గుర్తించి వారిని కూడా ఎన్‌ఎస్‌ఎస్‌ కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు సంవత్సర కాలంలో నిర్వహించిన 107 కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ డేను పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసారు. అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ భార్గవ్‌ తేజ(ఐఏఎస్‌)ని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్సలర్‌ కల్నల్‌ ప్రొఫెసర్‌ పి నాగభూషణ్, రిజిస్టార్‌ డాక్టర్‌ ఎమ్మెస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్స్, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.