తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత సచ్చిదానంద మూర్తిదే

తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత సచ్చిదానంద మూర్తిదే
-  విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య
 - విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి ఉత్సవాలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
భారతీయ తత్వశాస్త్రాన్ని విశ్వవ్యాప్తం చేసిన ఘనత పద్మవిభూషణ్‌ సచ్చిదానంద మూర్తి గారిదేనని విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎన్‌టీఆర్‌ విజ్ఞాన్‌ లైబ్రరీ, స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి ఉత్సవాలను వారం రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ సచ్చిదానంద మూర్తి గుర్తుగా తమ యూనివర్సిటీ లైబ్రరీలో ఆయన పేరు మీద ఇప్పటికే ఒక బ్లాక్‌ను ఏర్పాటు చేశామన్నారు. సామాన్యులకు తత్వశాస్త్రాన్ని విపులంగా అర్థమయ్యేటట్లు వివరించడంలో ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. సచ్చిదానంద మూర్తిగారు ఎన్నో గ్రంథాలను ఆంగ్లంలోను, తెలుగు హిందీలో కూడా రచించి విశ్వవిఖ్యాతి గాంచిన మహా మేధావిగా పేరుగాంచారన్నారు. నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు అందరూ సచ్చిదానంద మూర్తి బోధనలను వారి జీవితంలో అనువదించు కోవాలన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ సచ్చిదానంద మూర్తి గారు తన 14వ ఏటనే రచనలు రచించిన మేధావని కొనియాడారు. నేడు ఆయన శత జయంతి ఉత్సవాలను జరుపుకోవడం సమాజానికి ఎంతో అవసరమన్నారు. నేటి తరానికి ఆయన జీవితం ఒక స్ఫూర్తి అని, నేటి యువత ఆయన సూచించిన రాడికల్‌ ఫిలాసిఫీను అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.