Skip to main content

శత వసంతాల అక్కినేని


శత వసంతాల అక్కినేని
'నటసమ్రాట్' అక్కినేని శతజయంతి నేడే.
గత సంవత్సరం సెప్టెంబర్ 20 వ తేదీ నుంచి అక్కినేని కోలాహలం మొదలైంది.ప్రపంచమంతా వాడవాడలా విశేషంగా వేడుకలు నిర్వహిస్తున్నారు.
విగ్రహాల ఆవిష్కరణలు,
ప్రత్యేక సంచికలు,
ఛాయాచిత్రాల విశిష్ట ప్రచురణలతో కన్నులపండువగా ఈ సంబరాలు సాగుతున్నాయి.
తెలుగు జన హృదయ సామ్రాజ్యాలను దోచుకున్న 'నటసమ్రాట్' అక్కినేని.
ఆయనే అనేకసార్లు అన్నట్లుగా ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు.తానే చెక్కుకున్న అద్భుతమైన శిల్పం,తానే గీసుకున్న అందమైన 'చిత్రం'.
ఏ కాలేజీ చదువులు చదవని విద్యాధికుడు, ప్రపంచాన్ని,జీవితాన్ని విశ్వవిద్యాలయంగా భావించి,జీవించిన నిత్య అధ్యయనశీలి.చదువులంటే ఎంతో ఇష్టం.చదువుకున్నవారంటే అంతులేని గౌరవం.తను రాసిన
 'అ ఆలు..' చదివితే చాలు, అతనెంతటి ఆలోచనాపరుడో తెలుస్తుంది.ఆ జీవితాన్ని సమీక్షిస్తే తెలుస్తుంది, ఆయనెంతటి సాధకుడో! అది ఒక ప్రయోగశాల.
తొమ్మిది పదుల నిండుజీవితాన్ని పండించుకున్న పూర్ణ యశస్కుడు,
కళాప్రపూర్ణుడు.భారతీయ చలనచిత్ర జగతిలో ఆయన వేసిన పాత్రలు అజరామరం.సాంఘిక సినిమాలు ఆయన ప్రత్యేకం. ముఖ్యంగా మహాకవులు,
వాగ్గేయకారులు,మహాభక్తులు,
కళాకారుల పాత్రలకు పెట్టింది పేరు.కాళిదాసు,తెనాలి రామకృష్ణ ఇలాగే ఉండేవారేమో అనిపిస్తుంది. జయదేవుడు,విప్రనారాయణుడు ఈయనే ఏమో!అని భ్రమ కలుగుతుంది.చాణుక్యుడు అచ్చూ అలాగే ఉంటాడేమో అని అనుకుంటాం."స్పర్ధయాన్ వర్ధతే విద్య" అనే ఆర్యుల వాక్కు అక్కినేనికి నూటికి నూరుపాళ్ళు సరిపోతుంది.ఎన్టీఆర్ వంటి విద్యాధికుడు,పరమ ఆకర్షణా స్వరూపుడు అటువైపు ఉండగా, తన ఉనికిని కాపాడుకుంటూ,
తన విశిష్ట ముద్ర వేసుకోడానికి,
ఎంత తపన పడ్డాడో?
జగ్గయ్య  వంటి చదువరులు,
భానుమతి వంటి గడసరులు,
సావిత్రి వంటి ప్రతిభామణులు
ఉన్న కాలంలో,దీటుగా నిలబడడానికి ఎన్ని ధీరోదాత్తమైన ఆత్మదీపాలు వెలిగించుకున్నారో!అడుగడుగునా,ఆణువణువునా తనను తాను భద్రంగా కాపాడుకోవడానికి,గెలుపుగుర్రంపై స్వారీ చేయడానికి చెప్పలేనంత తపన పడ్డారు.ఆ తపనే తపస్సు.
హైస్కూల్ విద్య కూడా దాటని అక్షరాస్యతతో,మహాకవి కాళిదాసు,
తెనాలి రామకృష్ణ వంటి మహాకవుల పాత్రలు వేయడం బహు సాహసం,వేసి గొప్పగా మెప్పించడం బహు ఆశ్చర్యచకితం.
నిజజీవితంలో దైవభక్తి ఎరుగని మనిషి,పరమ భక్తులైన తుకారాం,విప్రనారాయణలుగా జీవించిన తీరు అనన్య సామాన్యం.
అమరశిల్పి జక్కనగా ఆయన వేసిన ముద్ర ఆయనకే చెల్లింది.
తెలుగు సినిమాలో డాన్సులు మొదలు పెట్టిన మొట్టమొదటి
హీరో ఆయనే.ద్విపాత్రాపోషణం ఆయనతోనే మొదలైంది.'నవరాత్రి' సినిమాలో ఏకంగా తొమ్మిది పాత్రలు పోషించారు.ఆయనే తొలి నవలా నాయకుడు కూడా.ఇక ప్రేమికుడు, భగ్నప్రేమికుడు పాత్రలు ఆయనకే చెల్లాయి. 'దేవదాసు'గా
ఆ విశ్వరూపాన్ని చూడవచ్చు.
హీరోకు ఆయన ఒక స్టైల్ తీసుకొచ్చారు.ఆ హెయిర్ కట్,
ఆ మీసకట్టు,డ్రెస్ ను కొన్ని లక్షలమంది అనుకరించారు. ఆయన స్టైల్ కొన్ని తరాలను శాసించింది.కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఎక్కడో రామాపురం/ వెంకటరాఘవాపురం అనే కుగ్రామంలో జన్మనెత్తాడు. దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం.పల్లెల్లో పొలాల్లో పనిచేసుకుంటూ,నాటకాలలో చిన్నచిన్న పాత్రలు వేసుకుంటూ నటప్రస్థానాన్ని ప్రారంభించారు.
స్త్రీ పాత్రలు వేసి,తొలినాళ్ళల్లోనే అందరినీ ఆకర్షించారు.పాటలు, పద్యాలు పాడి,డాన్సులు వేసి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు.
ఘంటసాల బలరామయ్య చలువతో తన ప్రగతిభవనానికి మెట్లు కట్టుకున్నారు.
16ఏళ్ళ వయస్సులోనే (1940) 'ధర్మపత్ని'తో సినిమా రంగంలో అడుగుపెట్టారు.20ఏళ్ళ ప్రాయంలోనే 'సీతారామ జననం'(1944)తో మొట్టమొదటగా కథానాయకుడు అయ్యాడు. అప్పటి నుంచి ఇక తిరిగి చూసుకోలేదు.అప్రతిహతంగా
ఏడు దశాబ్దాల పాటు మహాప్రస్థానం సాగింది. తొమ్మిదిపదుల వయస్సులోనూ 'మనం'లో జీవించి మెప్పించారు. జీవితంలో తుదిశ్వాస వరకూ నటించిన అరుదైన చరిత్రను లిఖించుకున్నారు.నటుడుగా విజృంభించడమే కాక,
'అన్నపూర్ణ' బ్యానర్ లో ఆణిముత్యాల వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు. తెలుగునేలపై చిత్రపరిశ్రమ ప్రభవించడానికి కృషిచేసి, సాధించినవారిలో అక్కినేనివారిది అగ్రశ్రేణి.కె.విశ్వనాథ్ లో దర్శకత్వ ప్రతిభ ఉందని తొలిగా గుర్తించినవారు అక్కినేని.కేవలం గుర్తించడమే కాక 'ఆత్మగౌరవం' సినిమాకు దర్శకుడుగా అవకాశమిచ్చి,ప్రోత్సహించినవారు కూడా ఆయనే.ఎక్కడ ప్రతిభ, పాండిత్యం వుంటే అక్కడ గుర్తించి,ఆ ప్రతిభామూర్తులను ప్రోత్సహించి,గౌరవించిన కళాహృదయుడు,ప్రతిభాపక్షపాతి అక్కినేని.మహాదాత కూడా.
గుడివాడలో కళాశాల నిర్మాణానికి, అప్పుడు తన దగ్గర ఉన్న డబ్బు మొత్తం ఇచ్చివేసిన త్యాగశీలి.
తన ప్రతిభ పట్ల,రేపటి పట్ల అచంచలమైన విశ్వాసంతో అంతటి దానం చేశారు.ఆ కాలేజీకి అక్కినేని నాగేశ్వరావుపేరు పెట్టుకున్నారు.
కేవలం గుడివాడ కాలేజీకే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ మొదలు ఎన్నో విద్యాలయాలకు భూరి విరాళాలు ఇచ్చారు.ఎందరికో, ఎన్నింటికో గుప్తదానాలు కూడా చేశారు.ఆర్ధిక క్రమశిక్షణను కాపాడుకుంటూనే,పాత్రత ఎరిగి దానం చేసే విజ్ఞత ఆయన సొత్తు.'అపాత్రాదానం' చేయకూడదన్నది ఆయన నియమం.తన విజ్ఞాన పరిధులను విశేషంగా విస్తరించుకోడానికై కవులు,మేధావులతో గడిపేవారు.సత్ సాంగత్యంలో గడపడం ఆయన నిత్యకృత్యం.
50ఏళ్ళ వయస్సులోనే గుండె దెబ్బతిన్నది.అమెరికాలో ఆపరేషన్ చేయించుకొని పునరుత్తేజం పొందారు.అప్పటి నుంచి జీవనశైలిని ఎంతో మార్చుకున్నారు.తన శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోడానికి ఋషి వలె కృషి చేశారు.గొప్ప సాధన చేశారు.
గుండె చాలా తక్కువ శాతం మాత్రమే పనిచేసేది.అచంచలమైన మనోధైర్యం,విచక్షణతో హృదయాన్ని ధృడంగా నిలుపుకున్నారు.ఆ తీరు అన్యులకు సాధ్యపడదు.సునిశితమైన పరిశీలన,చురుకైన చూపులు, పాదరసం వంటి మెదడు,నిలువెల్లా రసికత,గుండెనిండా పట్టుదల,
నిత్య కృషీవలత్వం అక్కినేని సుగుణాలు,సులక్షణాలు.
అకడమిక్ గా తాను పెద్ద చదువులు చదువుకోలేదనే స్మృతితో,పిల్లలను బాగా చదివించారు.చదివించడమే కాక,ఎంతో క్రమశిక్షణతో పెంచారు.
శ్రమ విలువ తెలియాలన్నది ఆయన సూక్తి. సినిమా జీవితంలోనూ,నిజ జీవితంలోనూ తన బలాలు,బలహీనతలు బాగా ఎరిగి నడుచుకున్నారు.
తాను ఎక్కడ రాణించగలనో తెలిసి అక్కడ విజృంభించారు.ఎచ్చట గెలవలేనో ఎరిగి అచ్చట విరమించుకున్నారు.రాజకీయాల్లో అనేకసార్లు అవకాశాలు వచ్చినా, చిరునవ్వుతో తప్పించుకున్నారు.
కానీ,రాజకీయాలను సునిశితంగా పరిశీలించడం ఎన్నడూ మానలేదు.
రాజకీయ నాయకులతో విస్తృతంగా సంబంధాలను పెంచుకున్నారు. ఆయనకి అదొక 'ఆట'విడుపు.
ఆయన నటించిన సినిమాలు, నిర్మించిన సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి రికార్డ్ సృష్టించాయి.నటుడుగా ఆయన పొందని సత్కారాలు లేవు,
ఆయనను చేరని బిరుదులు లేవు.
పద్మశ్రీ నుంచి పద్మవిభూషణ్ వరకూ,కళాప్రపూర్ణ నుంచి కాళిదాసు సమ్మాన్ వరకూ,
డాక్టరేట్ నుంచి దాదాసాహెబ్ ఫాల్కే వరకూ ఆన్నీ వరించాయి.
ఒక్క 'భారతరత్న' తప్ప, ఘనగౌరవాలన్నీ దక్కించుకున్నారు.
'అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్' స్థాపించారు.దాదా సాహెబ్ ఫాల్కేతో సమానమైన పురస్కారాలను ప్రతి ఏటా చలనచిత్ర ప్రతిభామూర్తులకు సమర్పించాలని సంకల్పం చేసుకున్నారు.దేవానంద్ మొదలు రేఖ వరకూ ఎందరో ప్రజ్ఞాప్రముఖులు 'ఏ ఎన్ ఆర్ నేషనల్ అవార్డు' ను అందుకున్నారు.అక్కినేని మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం అభినందనీయం. "బండరాళ్లను సైతం అరగించుకో గలిగిన వయసులో,డబ్బులు లేవు.
డబ్బులున్న నేడు వయస్సు లేదు" అంటూ జీవనసారాన్ని చెప్పిన తత్త్వవేత్త అక్కినేని.అక్కినేని వలె జీవించడం,జీవితాన్ని సాధించడం అందరికీ సాధ్యపడేది కాదు.
నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే నడచి వెళ్లిన అక్కినేని 'అమరజీవి'గా
అనంతమైన కాలంలో అఖండగా వెలుగుతూనే ఉంటారు.
- సేకరణ

Popular posts from this blog

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి

విజ్ఞాన్స్‌లో ‘‘డార్లింగ్‌’’ సినిమా యూనిట్‌ సందడి టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో శుక్రవారం సినీహీరో ప్రియదర్శి తన ‘డార్లింగ్‌’’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా సందడి చేశారు. కార్యక్రమంలో హీరో ప్రియదర్శి, హీరోయిన్‌ నభా నటేష్, దర్శకుడు అశ్విన్‌ రామ్,  ఇతర సినిమా సిబ్బంది పాల్గొన్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్స్‌పై కె.నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డిలు ‘‘ డార్లింగ్‌ ’’ సినిమాను నిర్మించారు.  సినిమాలో హీరోయిన్‌గా నభా నటేష్‌ నటించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సినీ హీరో ప్రియదర్శి మాట్లాడుతూ విద్యార్థులే నా బలగమని పేర్కొన్నారు.  ఈ నెల 19న సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. విద్యార్థులందరూ డార్లింగ్‌ సినిమాను ఆదరించి అఖండ విజయాన్ని అందించాలని కోరారు. ఈ చిత్రాన్ని స్లి్పట్‌ పర్సనాలిటీ అనే డిజార్డను ఆధారంగా చేసుకుని రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామన్నారు. ఈ సినిమాలో రొమాంటిక్‌ కామెడీ, యాక్షన్‌ ఎపిసోడ్స్, ఎమోషన్స్, డ్రామా ప్రేక్షకులందరికీ నచ్చుతాయన్నారు....

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత

వరద బాధితులకు విజ్ఞాన్స్‌ వర్సిటీ చేయూత టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ విజయవాడలోని వరద బాధితులకు చేయూతగా ఆహారాన్ని అందించామని వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యూనివర్సిటీ నుంచి వరుసగా రెండో రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన 6 బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూనివర్సిటీ తరుపున  వరద బాధితుల కోసం 10వేల కిచిడీ, పెరుగన్నం, వాటర్‌ ప్యాకెట్లను ప్రత్యేకంగా ప్యాకెంగ్‌ చేయించి బాధితులకు అందించామన్నారు. ఇది కష్ట సమయమని, ప్రతి ఒక్కరూ స్పందించాల్సిన తరుణమన్నారు. ప్రకృతి వైపరీత్యం వల్ల ప్రజలు పడుతున్న కష్టాలు ఎవరికీ రాకూడదన్నారు. అలాగే ప్రజలందరూ మానవసేవే మాధవసేవ అనే సిద్ధాంతంతో ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ

విజ్ఞాన్స్‌ వర్సిటీ సీఈవోగా డాక్టర్‌ కూరపాటి మేఘన బాధ్యతలు స్వీకరణ టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్: చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవో ( చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌)గా డాక్టర్‌ కూరపాటి మేఘన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ డాక్టర్‌ కూరపాటి మేఘన గడిచిన 10 సంవత్సరాల నుంచి కంటి స్పెషలిస్ట్‌ డాక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ మంచి పేరు సాధించుకున్నారని తెలియజేసారు. ఇక నుంచి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ సీఈవోగా తన బాధ్యతలను చక్కగా నిర్వహించి యూనివర్సిటీను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ కూరపాటి మేఘన మాట్లాడుతూ సీఈవోగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. యూనివర్సిటీలోని అన్ని విభాగాలను సమన్వయం చేసుకుని సమర్...