వరద సహాయక సర్వేలో పాల్గొన్న విజ్ఞాన్ విద్యార్థులు

వరద సహాయక సర్వేలో పాల్గొన్న విజ్ఞాన్ విద్యార్థులు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీ, విజ్ఞాన్ లారాకి చెందిన 300 కి పైగా విద్యార్థులు విజయవాడ నగరంలోని 18 వార్డ్స్ లో అందుతున్న సహాయక చర్యల సర్వేలో పాల్గొన్నారని వర్సిటీ వైస్ చాన్సలర్ కల్నల్, ప్రొఫెసర్ పి నాగభూషణ్ ఆదివారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్ చాన్సలర్ మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు విజయవాడ నగరంలోని కొన్ని ప్రాంతాలు వరద ముంపుకు గురైన విషయం అందరికీ తెలిసిందే. ఈ ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అందించిన సహాయక కార్యక్రమాలు, వివిధ రకాల సేవా కార్యక్రమాలు సరిగా అందాయా లేదా అనే సర్వేలో తమ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు పాల్గొన్నారని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో తమ యూనివర్సిటీ కి చెందిన విద్యార్థులు ముమ్మరంగా పర్యటించి వారికి సరైన సమయంలో ఆహారం అందుతుందా లేదా?  ప్రభుత్వం అందించిన రేషన్ వారికి చేరిందా లేదా ? వారికి అందుతున్న సహాయక చర్యలు బాగున్నాయా లేదా? వారు నివసిస్తున్న ప్రాంతాల్లో శానిటేషన్ జరిగిందా లేదా? వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా, మంచినీటి సరఫరా జరుగుతుందా లేదా? ముఖ్యమంత్రి మరియు ఇతర ప్రభుత్వ అధికారుల పనితీరుపై మీరు సంతృప్తిగా ఉన్నారా లేదా అనే అంశాలపై ఎప్పటికప్పుడు ప్రజల నుంచి డేటా సేకరించి ప్రభుత్వం అందించిన గూగుల్ లింక్ లో తమ విద్యార్థులు అప్డేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారా లేక దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా? వరదల వల్ల సంబంధిత కుటుంబం ఎంత నష్టపోయారు అనే విషయాన్ని కూడా సేకరించి సంబంధిత లింక్ లో పొందుపరుస్తున్నారని వెల్లడించారు. ఏదైనా ప్రాంతాల్లో సహాయచర్యలు సరిగా జరగకపోయినా వెంటనే తమ విద్యార్థులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. వరద సహాయక చర్యల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, రిజిస్టార్ డాక్టర్ ఎమ్మెస్ రఘునాథన్, విజ్ఞాన్ లారా కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే. ఫణీంద్ర కుమార్, ఆయా విభాగాల డీన్స్, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.