విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు

విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఘనంగా ఫ్రెషర్స్‌ డే వేడుకలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఆదివారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఫ్రెషర్స్‌డే వేడుకలను వైభవంగా నిర్వహించారు.  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ సీనియర్‌ విద్యార్థులు జూనియర్‌ విద్యార్థులకు యూనివర్సిటీ  విధివిధానాలు, కల్చర్‌ గురించి పూర్తిగా అవగాహన కల్పించాలన్నారు. తమ యూనివర్సిటీలో విద్యార్థులు స్వేచ్ఛగా విద్య నభ్యసించ వచ్చునన్నారు. ఇక్కడ అధ్యాపకులు దగ్గర నుంచి వైస్‌ చాన్స్‌లర్‌ వరకు అందరూ అందుబాటులో ఉంటారని, మీకేమైనా ఇబ్బందులు తలెత్తితే మమ్మల్ని నేరుగా సంప్రదించవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునే దిశగా సాగాలని, వైఫల్యాలను సైతం విజయానికి సోపానంగా మార్చుకోవాలని సూచించారు. సాహసాలు చేయడానికి ఎప్పుడూ వెనుకాడకూడదు. అప్పుడే గొప్ప విజయాలు సిద్ధిస్తాయన్నారు. విజయం అంటే కేవలం వ్యక్తిగతమే కాదు. సమాజంలోని పక్కవారిని ఉద్దరించడమే నిజమైన విజయమన్నారు. జిజ్ఞాస, సమర్ధ సమయ పాలన, బుద్ధి స్థిరత్వం, వేగంగా సంగ్రహించుకోగలగడం... ఇలా ఎన్నో అంశాలు మీ విజయాన్ని ప్రభావితం చేస్తాయన్నారు. విద్యార్థులు వారి ఆలోచనలు, జ్ఞానాన్ని సహచర విద్యార్థులతో పంచుకుంటే అంతకుమించిన గొప్ప అధ్యయనం మరోటి ఉండదని పేర్కొన్నారు. విద్యార్థులు పెద్ద పెద్ద లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని అందుకునేందుకు పరుగిడాలని పిలుపునిచ్చారు. ఫ్రెషర్స్‌ డే సందర్భంగా మొదటి సంవత్సరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆటపాటలు, సంగీత వాయిద్యాలతో వర్సిటీ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. ఫ్రెషర్స్‌ డే వేడుకల్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసారు. కార్యక్రమంలో ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.