వ్యాధుల నుంచి రక్షణపై విజ్ఞాన్‌ విద్యార్థుల అవగాహన

వ్యాధుల నుంచి రక్షణపై విజ్ఞాన్‌ విద్యార్థుల అవగాహన
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీకి చెందిన ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు విజయవాడ వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలకు అధిక వర్షం, వరదల వచే కాలానుగుణ వ్యాధుల నుంచి రక్షణ ఎలా పొందాలో అవగాహన కల్పించారని వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వైస్‌ చాన్సలర్‌ మాట్లాడుతూ యూనివర్సిటీకి చెందిన 280 మంది ఎన్‌ఎస్‌ఎస్‌ విద్యార్థులు మూడు గ్రూపులుగా విడిపోయి విజయవాడ నగరంలోని తోట వారి వీధి, నందమూరి నగర్, ఇందిరా కాలనీల్లోని ప్రజలకు వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారని తెలియజేసారు. ఇంట్లో, పరిసరాల్లో దోమలు, ఈగలు లేకుండా చూసుకోవాలన్నారు. వరద సమయం కాబట్టి ఇంట్లో ఉన్న విద్యుత్‌ ఉపకరణములు జాగ్రత్తగా వినియోగించాలన్నారు. ఇంటి లోపల, ఇంటి బయట, రోళ్లు వంటి సామాగ్రిలో నీరు నిలువ లేకుండా చూడాలన్నారు. కాచి చల్లార్చిన పరిశుభ్రమైన నీటిని తాగాలని, ఆహార పదార్థాల పైన మూతలు ఉంచాలని, కూరగాయలు, పండ్లను మంచి నీటితో కడిగిన పిమ్మటే ఉపయోగించాలని సూచించారు. అతిసార వ్యాధి లక్షణాలు ఉన్న ఎడల ఇంటి వద్ద లభించే ద్రవ పదార్థాలు తీసుకోవాలని లేదా దగ్గరలోని ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. వరద సమయం కాబట్టి వరద నీటితో పాటు పాములు, తేళ్లు మొదలగునవి ఇంటి పరిసర ప్రాంతాల్లోకి చేరి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు. దోమలు ఇంట్లోకి రాకుండా ప్రతి రోజు సాయంత్రం తలుపులను, కిటికీలను మూసి వేయాలన్నారు. వరద సహాయక చర్యల సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులను విజ్ఞాన్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వైస్‌ చాన్సలర్‌ కల్నల్‌ ప్రొఫెసర్‌ పి నాగభూషణ్, రిజిస్టార్‌ డాక్టర్‌ ఎమ్మెస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్స్, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.