ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి

ప్రాథమిక అంశాలపై అవగాహన తప్పనిసరి  
-  చైనాలోని షెంఝెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మెహరన్‌ మజాందరణి
 - విజ్ఞాన్స్‌లో ఘనంగా ముగిసిన ఐసీఎన్‌ఏఎస్‌సీ–24 అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ఇంజినీరింగ్‌ విద్యార్థులు వారి బ్రాంచిలకు సంబంధించిన సబ్జెక్టులపైనేకాకుండా ప్రాథమిక సైన్స్, మేథమేటిక్స్‌ విషయాలపై అవగాహనతో ఉంటే ఎంతో మంచిదని చైనాలోని షెంఝెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మెహరన్‌ మజాందరణి తెలిపారు.. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ విభాగంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ మేథమ్యాటిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ విభాగం, సెర్బ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో  ‘‘ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ నాన్‌–లీనియర్‌ అనాలిసిస్‌ అండ్‌ సైంటిఫిక్‌ కంప్యూటింగ్‌ (ఐసీఎన్‌ఏఎస్‌సీ–2024)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించిన అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌ను హైబ్రిడ్‌ మోడ్‌లో (ఆన్‌లైన్‌ అండ్‌ ఆఫ్‌లైన్‌) శనివారం ఘనంగా ముగించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చైనాలోని షెంఝెన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మెహరన్‌ మజాందరణి మాట్లాడుతూ మార్కెట్‌లలో ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి, సమీకృత ఆర్థిక మార్పులపై అధ్యయనం చేయడానికి మేథమేటిక్స్‌లోని డిఫరెన్షియల్‌ సమీకరణాలనే ఉపయోగించాలన్నారు. అంతేకాకుండా జనాభా వృద్ధి, వ్యాధుల వ్యాప్తి మొదలైన వాటిని అంచనా వేసేందుకు కూడా ఈ సమీకరణాలు ఉపయోగిస్తామని వెల్లడించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ ప్రొఫెసర్‌ పూనమ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఆర్థోగోనల్‌ అర్రేల సహాయంతో ఒక ప్రోడక్ట్‌ యొక్క నాణ్యతను మెరుగుపరచడం, తగిన ప్రమాణాలు ఎలా కలవాలి? ఎంతమేరకు విభిన్న ప్రామాణికాలను పాటించాలి అనే విషయాలను అంచనా వేయడానికి ఇవి ఉపయోగిస్తారన్నారు. విమానాలు, రాకెట్లు వంటి సాంకేతిక పరికరాల్లో పునరావృత పరీక్షలు చేయడానికి ఆర్థోగోనల్‌ అర్రేలతో తక్కువ సంఖ్యల పరీక్షలతో మంచి ఫలితాలు పొందవచ్చన్నారు. డేటా ట్రాన్స్‌మిషన్‌ లో ఆర్థోగోనల్‌ కోడింగ్‌ టెక్నిక్స్‌ను ఉపయోగించి లోపాలను నివారించడంలో సాయం చేస్తాయన్నారు. విద్యాసాగర్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ మధుమంగల్‌ పాల్‌ మాట్లాడుతూ ఫజీ గ్రాఫ్‌లను  టెలికమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌లలో ఉపయోగించవచ్చునన్నారు. క్షణిక మార్పులు లేదా తప్పులు వచ్చినపుడు కూడా సర్వీసులను ప్రభావితం చేయకుండా ఉంచడంలో ఇవి ఉపయోగపడతాయన్నారు. కంప్యూటర్‌ విజన్, ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ రంగాలలో ఫజీ గ్రాఫ్‌లు, టోపోలాజికల్‌ ఇండెక్సులు వాడటం ద్వారా ఇమేజ్‌లలోని అంచులు, ఆకారాలు, రంగులను సులభంగా గుర్తించవచ్చని తెలియజేసారు. భోపాల్‌లోని ఐఐఎస్‌ఈఆర్‌ డాక్టర్‌ మానస్‌ కర్‌ మాట్లాడుతూ స్కానింగ్‌ పద్ధతుల ద్వారా కలిగిన డేటా ఆధారంగా ఆంతరంగిక అవయవాల రీడింగ్‌ చెయ్యడానికి ఇన్వర్స్‌ ప్రాబ్లమ్స్‌ ఉపయోగిస్తారన్నారు. సిటీ స్కాన్, ఎంఆర్‌ఐ వంటి స్కానింగ్‌ సాంకేతిక పరిజ్ఞానాల్లో ఈ పద్ధతులను విస్తృతంగా వాడుతారని పేర్కొన్నారు. కమ్యూనికేషన్, కంప్యూటర్‌ సైన్స్‌లో, వాస్తవ డేటా మరియు అసలు సమాచారంతో సంబంధం పెట్టి లోపాలను సరిచేయడానికి ఇన్వర్స్‌ ప్రాబ్లమ్స్‌ ఉపయోగిస్తారని పేర్కొన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన పలు పోటీల్లో సత్తాచాటిన విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేసారు. కార్యక్రమంలో వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.