ప్రపంచం గర్వించదగిన తత్వవేత్త సచ్చిదానంద మూర్తి

ప్రపంచం గర్వించదగిన తత్వవేత్త సచ్చిదానంద మూర్తి 
-మాజీ రాజ్యసభ సభ్యులు, విశ్వ హిందీ పరిషత్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ వై.లక్ష్మీప్రసాద్‌
  - చదువులో ఉన్న మర్మాన్ని గ్రహించారు : అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌
- విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ముగిసిన ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి ఉత్సవాలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ప్రపంచం గర్వించదగిన తత్వవేత్తగా ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి గారు ఎనలేని ఖ్యాతి గడించారని మాజీ రాజ్యసభ సభ్యులు, విశ్వ హిందీ పరిషత్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ వై.లక్ష్మీప్రసాద్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఎన్‌టీఆర్‌ విజ్ఞాన్‌ లైబ్రరీ, స్కూల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ సైన్సెస్‌ అండ్‌ హ్యుమానిటీస్‌ల సంయుక్త ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి ఉత్సవాలను మంగళవారం ఘనంగా ముగించారు. ఈ సందర్భంగా సచ్చిదానంద మూర్తి గారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆయనపై ప్రత్యేకంగా రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ రాజ్యసభ సభ్యులు, విశ్వ హిందీ పరిషత్‌ నేషనల్‌ ప్రెసిడెంట్‌ వై.లక్ష్మీప్రసాద్‌ మాట్లాడుతూ తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం వేరువేరని చెప్పినది మూర్తిగారేనని తెలియజేసారు. తన 14వ ఏటనే రచనలు రచించిన మేధావని కొనియాడారు. విద్యార్థులందరూ తెలుగు భాషను అమ్మ భాషగా నేర్చుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్క విద్యార్థి ఆధ్యాత్మికత, ధార్మికతను పెంచుకోవాలన్నారు. 

చదువులో ఉన్న మర్మాన్ని గ్రహించారు : అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌

చదువులో ఉన్న మర్మాన్ని గ్రహించారు కాబట్టే కొత్త సచ్చిదానంద మూర్తి గారు గొప్ప తత్వవేత్తగా ఎదిగారని అవనిగడ్డ నియోజకవర్గం ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌ అన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్‌ మాట్లాడుతూ సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి స్వయం కృషితో ఉన్నత స్థానాలకు అధిరోహించారన్నారు. ప్రతి విద్యార్థి సచ్చిదానంద మూర్తి గారి ఆలోచనలు, ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మొదటగా సంస్కృతంలో విద్యను నేర్చుకోవటం ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత అనేక భాషల్లో ప్రావీణ్యం పొందడమనేది ఆయనకు మాత్రమే చెల్లిందన్నారు. ఆధునిక కాలంలో సర్వేపల్లి రాధాకృష్ణ, జిడ్డు కృష్ణమూర్తి గారితో సమానంగా పేరు ప్రఖ్యాతలు సాధించారని పేర్కొన్నారు. తత్వశాస్త్రంతో ప్రజల్లో మానవత్వాన్ని పెంపొందించి, సమాజంలో మార్పుకు కృషి చేశారని తెలియజేసారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా కళాశాలల అభివృద్ధికి, సర్వమతాల సౌభ్రాతృత్వానికి కృషి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ ఫిలాసఫీ డిపార్ట్‌మెంట్‌ మాజీ హెడ్, ప్రొఫెసర్‌ బీ.సాంబశివ ప్రసాద్‌ మాట్లాడుతూ సచ్చిదానంద మూర్తిగారు తన జీవితమంతా చదవడం, రాయడం, చెప్పడం, అధ్యయనం చేయడంలోనే ఉన్నారని తెలిపారు. మూర్తిగారితో కలిసి పనిచేసే అవకాశం నాకు లభించడం తన జీవితంలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. మూర్తిగారు తన జీవితమంతా అకడమిక్‌గా ఆలోచిస్తూనే ఉండేవారని తెలియజేసారు. 36 సంవత్సరాలకే ప్రొఫెసర్‌గా ఎంపికైన ఘనత మూర్తిగారికే దక్కుతుందన్నారు. ఆయన జీవిత కాలంలో 35కు పైగా పుస్తకాలను రచించారని తెలిపారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య మాట్లాడుతూ మూర్తిగారి విస్తృత సేవల వల్లనే చాలా మంది పేద విద్యార్థులకు విద్య అందుబాటులోకి వచ్చిందని గుర్తు చేశారు. అందరి లాగా కాకుండా తనకంటూ ప్రత్యేక శైలిని అలవర్చుకోవడం వలనే ఆయనకు తత్వశాస్త్రంలో ప్రత్యేక స్థానం లభించిందన్నారు. వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ సామాన్యులకు తత్వశాస్త్రాన్ని విపులంగా అర్థమయ్యేటట్లు వివరించడంలో ఆయన ఎనలేని కృషి చేశారని పేర్కొన్నారు. సచ్చిదానంద మూర్తిగారు ఎన్నో గ్రంథాలను ఆంగ్లంలోను, తెలుగు హిందీలో కూడా రచించి విశ్వవిఖ్యాతి గాంచిన మహా మేధావిగా పేరుగాంచారన్నారు. నేటి ఆధునిక యుగంలో విద్యార్థులు అందరూ సచ్చిదానంద మూర్తి బోధనలను వారి జీవితంలో అనువదించు కోవాలన్నారు. అనంతరం కొత్త సచ్చిదానంద మూర్తి శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన వివిధ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు, అధ్యాపకులకు నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేసారు. అనంతరం ముఖ్య అతిథులను, కొత్త సచ్చిదానంద మూర్తిగారి కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కొత్త రమేష్, రావెల సాంబశివరావు, డాక్టర్‌ సీ.వెంకటాచలం, డాక్టర్‌ పీ.సుబ్బారావు, సచ్చిదానంద మూర్తి గారి కుటుంబ సభ్యులు, విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.