యువ మేధో శక్తులను పరిశోధనల వైపు మళ్లించాలి

యువ మేధో శక్తులను పరిశోధనల వైపు మళ్లించాలి
- కర్ణాటక – హసన్‌ ప్రాంతంలోని ఎమ్‌ఈ– ఆర్‌ఐఐఎస్‌ఈ ఫౌండేషన్‌ సీఈవో, మల్నాడ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ డీన్, ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏ. గీతా కిరణ్‌
 -విజ్ఞాన్‌లో ఘనంగా ఇగ్నైటింగ్‌ యంగ్‌ మైండ్స్‌ ఫర్‌ రీసెర్చ్‌ ప్రోగ్రామ్‌

టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
యువ మేధో శక్తులైన విద్యార్థులందరినీ పరిశోధనల వైపు మళ్లించాలని కర్ణాటక – హసన్‌ ప్రాంతంలోని ఎమ్‌ఈ– ఆర్‌ఐఐఎస్‌ఈ ఫౌండేషన్‌ సీఈవో, మల్నాడ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కార్పొరేట్‌ అఫైర్స్‌ డీన్, ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఏ. గీతా కిరణ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఆఫీస్‌ ఆఫ్‌ డీన్‌– అకడమిక్స్, అసెస్‌మెంట్‌ అండ్‌ అవార్డ్స్‌ ఆధ్వర్యంలో మూడో సంవత్సరం బీటెక్‌ విద్యార్థుల కోసం ‘‘ఇగ్నైటింగ్‌ యంగ్‌ మైండ్స్‌ ఫర్‌ రీసెర్చ్‌’’ ప్రోగ్రామ్‌ను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విద్యార్థుల్లో ఇంటర్‌–డిసిప్లినరీ పరిశోధన సామర్థ్యాన్ని పెంపొందించే ఉద్దేశ్యంతో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ ఏ.గీతా కిరణ్‌ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పరిశోధనలకు రోజు రోజుకు ప్రాధాన్యత మరింత పెరుగుతుందన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకత, జిజ్ఞాస, శక్తిని పరిశోధన వైపు మలచడం అనేది దేశాభివృద్ధికి కీలక అంశమన్నారు. ఈ నేపథ్యంలో యువ మేధో శక్తులను రగిలించి, వారి ఆలోచనలను పరిశోధన రంగంలోకి నడిపించడం ఎంతో ముఖ్యమన్నారు. అదే విధంగా స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించే విద్యా విధానాన్ని తీసుకురావడం అవసరమన్నారు. ఈరోజుల్లో విద్యార్థులు కళాశాలల్లో పుస్తకాలను మాత్రమే చదవడం కాకుండా సైన్స్, టెక్నాలజీ, ఆర్ట్స్‌ తదితర రంగాల్లో పరిశోధనపై దృష్టిపెట్టడం అవసరమన్నారు. ప్రాజెక్ట్‌ బేస్డ్‌ లెర్నింగ్, ఇన్నోవేషన్‌ హబ్‌లు, ల్యాబ్‌ ఫెసిలిటీలను పెంపొందించడం ద్వారా విద్యార్థులు పరిశోధనకు దారితీసే ఆసక్తిని పెంచుకోవచ్చు. అదే విధంగా పరిశోధన రంగంలో విజయవంతమైన వ్యక్తులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు విద్యార్థులకు తమ అనుభవాలను పంచుకునే కార్యక్రమాలను నిర్వహించడం కూడా ఎంతో ప్రేరణను కలిగిస్తుందన్నారు. వారి విజయాలు, కృషి, సవాళ్ల గురించి వినడం ద్వారా యువత పరిశోధనలో ముందుకు రావడానికి స్ఫూర్తి పొందుతారని తెలియజేసారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ మాట్లాడుతూ సాంకేతిక శిబిరాలు, వర్క్‌షాప్‌లు, సైన్స్‌ ఫెయిర్లు యువతలో ఆవిష్కరణలపై ఆసక్తిని పెంచుతాయన్నారు. సైన్స్‌ మరియు టెక్నాలజీకి సంబంధించిన ప్రాజెక్ట్‌లు యువతలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు అనువుగా ఉంటాయన్నారు. ఈ తరహా కార్యక్రమాలు విద్యార్థులకు తమ ఆలోచనలను ఆచరణలోకి తెచ్చే అవకాశం ఇస్తాయన్నారు. పరిశోధనకు కావలసిన ఆర్థిక వనరులు, వేతనాలు అందించడం ద్వారా యువతను పరిశోధన వైపు ప్రోత్సహించవచ్చుననన్నారు. పరిశోధన వలన సమాజానికి కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం కూడా చాల కీలకమన్నారు. సైన్స్, ఇంజనీరింగ్, వైద్య రంగం, ఆర్థిక రంగం తదితర రంగాలలో పరిశోధన ఎంత ముఖ్యమైందో తెలియజేసి, యువతను ఆ దిశగా ముందుకు నడిపించాలన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.