మానసిక ఆరోగ్యం ఒక నిరంతర ప్రక్రియ

మానసిక ఆరోగ్యం ఒక నిరంతర ప్రక్రియ
-విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌
-విజ్ఞాన్స్‌లో ప్రారంభమైన వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే ఉత్సవాలు
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
మానసిక ఆరోగ్యం అనేది ఒక నిరంతర ప్రక్రియని, దీనిపై మనం ప్రతి రోజూ శ్రద్ధ తీసుకోవాల్సిందేనని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్‌ అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ సైకాలజీ, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సోషియల్‌ సైన్స్‌ అండ్‌ హ్యుమానిటీస్, డీన్‌ ఆఫ్‌ స్టూడెంట్‌ అఫైర్స్, ఏఎఫ్‌డీ, ఐక్యూఏసీ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో 5 రోజుల పాటు నిర్వహించనున్న వరల్డ్‌ మెంటల్‌ హెల్త్‌ డే ఉత్సవాలను శుక్రవారం వర్సిటీలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా 5 రోజుల పాటు నిర్వహించబోయే కార్యక్రమాలకు సంబంధించిన బ్రౌచర్‌ను వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు ఆవిష్కరించారు. ముందుగా విద్యార్థులందరూ యూనివర్సిటీ ప్రాంగణంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైస్‌ చాన్స్‌లర్‌ మాట్లాడుతూ ‘‘ థాట్‌ ఫెస్ట్‌ – ఇట్స్‌ టైమ్‌ టు టాక్‌ అబౌట్‌ మెంటల్‌ హెల్త్‌’’ అనే కార్యక్రమాన్ని ‘‘ ఇట్‌ ఈస్‌ టైమ్‌ టు ప్రయారిటైజ్‌ మెంటల్‌ హెల్త్‌ ఇన్‌ ద వర్క్‌ ప్లేస్‌’’ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్యం మన భావోద్వేగాలు, ఆలోచనలు, ప్రవర్తనలపై ప్రభావం చూపుతుందన్నారు. మానసిక ఆరోగ్యం మనకు సంతోషం, ఒత్తిడి వంటి అనుభవాలను ఎదుర్కొనే విధానాన్ని, అలాగే ఇతరులతో మన సంబంధాలను ఎలా నిర్వహిస్తామో తెలియజేస్తుందన్నారు. మనలో ఉండే ఆత్మవిశ్వాసం మానసిక ఆరోగ్యానికి పునాదని, ఇది మనకు సమస్యలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందన్నారు. మనకు అనుభూతులు ఎలా ఉంటాయో, వాటిని ఎలా వ్యక్తీకరిస్తామో మన మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందన్నారు. జీవితంలో ఒత్తిడి అనేది సాధారణం, కాని దానిని ఎలా నియంత్రించాలో నేర్చుకోవడం ముఖ్యమన్నారు. ఏ పని అయినా ధైర్యంగా చేయడం, సమస్యలను పరిష్కరించడం ఒక మంచి లక్షణమన్నారు. మానసిక ఆరోగ్యానికి హాని కలిగించే అంశాలలో అవగాహన లేకపోవడం, మానసిక సమస్యలు ఉన్నా వాటిని గుర్తించకపోవడం, ఒంటరితనం, సమాజంలో ఉన్న సహాయాన్ని వాడుకోకపోవడం, ఒంటరిగా బాధపడడం, అనారోగ్యకర జీవనశైలి, ఆహారం, నిద్ర, వ్యాయామం లాంటివి సరిగా పాటించకపోవడమే ముఖ్య కారణమన్నారు. వీటికి పరిష్కారంగా మానసిక సమస్యలు ఎదురయ్యినప్పుడు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడడం లేదా నిపుణుల సలహా తీసుకోవడం ముఖ్యమన్నారు. నిత్య వ్యాయామంతో శారీరక ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుందన్నారు. ధ్యానం, యోగా ఇవి మనం ప్రశాంతంగా ఉండేందుకు, ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఎంతో సహాయపడతాయన్నారు. అనంతరం విద్యార్థులతో ఒత్తిడిని, సమస్యలను ఎలా అధిగమించాలో చూపిస్తూ పలు కార్యక్రమలను నిర్వహించారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల వైస్‌ చైర్మన్‌ లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్సిటీ వైస్‌ చాన్స్‌లర్‌ కల్నల్, ప్రొఫెసర్‌ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్‌ డాక్టర్‌ ఎంఎస్‌ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.