పాలిమర్‌ల సాయంతో పర్యావరణ కాలుష్యం తగ్గించవచ్చు
- పూణెలోని సోమయ్య విద్యావిహార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీ.వీ.అవధాని
- విజ్ఞాన్స్ వర్సిటీలో ఘనంగా ప్రారంభమైన జాతీయస్థాయి కాన్ఫరెన్స్
జీవశక్తితో సులభంగా కరిగే పాలిమర్‌లను అభివృద్ధి చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చునని పూణెలోని సోమయ్య విద్యావిహార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీ.వీ.అవధాని పేర్కొన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెర్బ్ ఇండియా ఏఎన్‌ఆర్‌ఎఫ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో ‘‘ ఫ్రాంటియర్స్ ఇన్ పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్‌సీఎఫ్‌పీఎస్‌టీ–2024)’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న జాతీయస్థాయి కాన్ఫరెన్స్‌ను గురువారం వైభవంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కాన్ఫరెన్స్‌కు సంబంధించిన ప్రొసీడింగ్స్ బ్రౌచర్‌ను ముఖ్య అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పూణెలోని సోమయ్య విద్యావిహార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సీ.వీ.అవధాని మాట్లాడుతూ పాలిమర్ సైన్స్ మరియు టెక్నాలజీ రంగం ఎన్నో విధాలుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందన్నారు. మెడికల్ ఫీల్డ్‌లో ఉపయోగించే పాలిమర్స్ మన్నికైన ఔషధ డెలివరీ వ్యవస్థల అభివృద్ధికి, మెరుగైన సర్జికల్ పరికరాల అభివృద్ధికి తోడ్పడతాయన్నారు. అధునాతన పాలిమర్‌లు సౌర ప్యానెల్స్, బ్యాటరీలు, సెన్సార్ల తయారీలో కూడా ఉపయోగపడతాయన్నారు. తక్కువ వ్యయంతో అధిక సామర్థ్యం కలిగిన పరికరాలను అందించే అవకాశం ఉందన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన కేరళలోని సెయింట్ బెర్చ్‌మన్స్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రెంజిత్ థామస్ మాట్లాడుతూ పాలిమర్‌లు ప్లాస్టిక్, రబ్బర్, ఫైబర్స్, ప్యాకేజింగ్, మెడికల్ పరికరాలు వంటి అనేక విభాగాల్లో వినియోగిస్తారని విద్యార్థులకు తెలియజేసారు. ప్లాస్టిక్ కాలుష్యానికి ప్రత్యామ్నాయంగా బయోపాలిమర్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. స్మార్ట్ పాలిమర్స్ ఉష్ణోగ్రత, పీహెచ్, వెలుతురు వంటి పరిస్థితుల మార్పులకు అనుగుణంగా స్పందిస్తాయన్నారు. ఈ స్మార్ట్ పాలిమర్‌లను మెడికల్ రంగంలో, ముఖ్యంగా డ్రగ్ డెలివరీ సిస్టమ్‌లలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారని వెల్లడించారు. మరో ముఖ్య అతిథిగా హాజరైన భువనేశ్వర్‌లోని ఐఐటీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కే. విజయక్రిష్ణ మాట్లాడుతూ నానోపాలిమర్‌లు చిన్న పరమాణు స్థాయిలో రూపొందించి అధిక నాణ్యత కలిగిన వస్తువులను సృష్టించేందుకు ఉపయోగపడుతున్నాయన్నారు. మెడికల్ డయాగ్నోస్టిక్స్, కేన్సర్ చికిత్స, ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీలలో వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. రీసైక్లింగ్ చేసిన పాలిమర్‌ల ద్వారా పర్యావరణ రక్షణకు తోడ్పడవచ్చు. పాలిమర్ సైన్స్ ఆధారంగా కొత్త ప్రొడక్ట్‌ల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు పురోగతిని తీసుకువస్తుందన్నారు. ప్యాకేజింగ్, మిలటరీ, ఎలక్ట్రానిక్స్, ఆహార పదార్థ రక్షణ వంటి రంగాలలో ఈ సాంకేతికత విస్తృతంగా ఉపయోగపడుతోందని వెల్లడించారు. పాలిమర్ సైన్స్‌లోని ఆధునిక పరిశోధనలు మన సమాజానికి శాశ్వతమైన మార్పులను అందించగలవని, అవి పరిశ్రమలతో పాటు పర్యావరణానికి కూడా ఒక సరైన దిశ చూపుతాయని అభిప్రాయపడ్డారు. అనంతరం ముఖ్య అతిథులును ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హైదరాబాద్‌లోని ఐఐసీటీ సైంటిస్ట్ డాక్టర్ ఎస్.ప్రశాంత్ కుమార్, విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.