కొత్త రసాయన చర్యల ఆవిష్కరణ సాధ్యమే
- ఐఐఎస్‌సీ బెంగళూరు ప్రొఫెసర్ ఏటీ.బిజు
- విజ్ఞాన్స్‌లో ఘనంగా కొనసాగుతున్న ఇంటర్నేషనల్ సెమినార్
ఆర్గానో క్యాటలిసిస్ ద్వారా అనేక కొత్త రసాయన చర్యలను అవిష్కరించడం సాధ్యమవుతోందని, అంతేకాకుండా ఇవి పరిశోధనలో పురాతన మార్గాలను తెరవగలవని ఐఐఎస్‌సీ బెంగళూరు ప్రొఫెసర్ ఏటీ.బిజు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ విభాగంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, న్యూఢిల్లీలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఐఎఫ్‌సీపీఏఆర్ (ఇండో–ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ అడ్వాన్డ్స్ రీసెర్చ్), సీఈఎఫ్‌ఐపీఆర్‌ఏ (సెంటర్ ప్రాంకో–ఇండీన్ పౌర్ లా ప్రమోషన్ డీ లా రీసెర్చ్ అవంకీ)ల ఆర్థిక సౌజన్యంతో జాయింట్ ఇండో–ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ సెమినార్ ఆన్ ‘‘ ఎక్స్‌ప్లోరింగ్ కాంటెంపోరరి విస్తాస్ ఇన్ అపై్లయింగ్ (ఆర్గానో) కాటలిసిస్ ఫర్ ఫార్మా ఇండస్ట్రీ: ఫర్ సస్టేయినింగ్ ఫ్యూచర్’’ అనే అంశంపై మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ సెమినార్‌ను రెండో రోజు గురువారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐఐఎస్‌సీ బెంగళూరు ప్రొఫెసర్ ఏటీ.బిజు మాట్లాడుతూ ఆర్గానోక్యాటలిసిస్ అనేది ఒక ప్రత్యేకమైన రసాయన పద్ధతని, ఇది పరిశోధన, పరిశ్రమల్లో అనేక రకాలుగా ఉపయోగపడుతుందన్నారు. ఇది వివిధ రసాయన మార్పిడులను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఆర్గానోక్యాటలిసిస్ ద్వారా ఔషధ సంశ్లేషణ వేగంగా మరియు సమర్థంగా జరుగుతుందన్నారు. అంతేకాకుండా ఇది కొత్త రకాల ఔష«ధాల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ విధానంలో హానికరమైన లోహ క్యాటలిస్టులు అవసరం ఉండకపోవడం వల్ల ఇది పర్యావరణానికి అనుకూలమైన పద్ధతిగాను, అధిక నాణ్యత గల పాలిమర్ ఉత్పత్తికి దోహదపడతాయన్నారు. ఈ విధానం అనేక క్లిష్టమైన రసాయన మార్పిడులను సులభతరం చేయడంతో పాటు సేంద్రియ యోగికాలను తక్కువ ఖర్చుతో తయారు చేయవచ్చునన్నారు. కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా హాజరైన భోపాల్‌లోని ఐఐఎస్‌ఈఆర్ ప్రొఫెసర్ నితిన్ టీ.పాటిల్ మాట్లాడుతూ రసాయన శాస్త్రం పరిశోధనల్లో రోజురోజుకు వినూత్న అభివృద్ధి చెందటంతో పాటు ఔషధ తయారీ, సేంద్రియ రసాయన శాస్త్రం, మెటీరియల్స్ సైన్స్, కేన్సర్, మధుమేహం, న్యూరోడిజెనరేటివ్ వ్యాధులకు సంబంధించి మందులను రూపొందించడంలో ఉపయోగపడుతుందన్నారు. పర్యావరణ హాని లేకుండా స్వచ్ఛమైన సమ్మేళనాలను తయారుచేయడం సాధ్యమవుతుందన్నారు. ఆహారంలో రుచిని, రంగును మెరుగుపరచే రసాయనాలను తయారు చేయడంలో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ ఎస్.భాస్కర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వై.శ్రీనివాసరావు, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ జీ.శేఖర్, ఎన్‌ఐటీ వరంగల్ నుంచి డాక్టర్ సీ.రఘు, వివిధ దేశాల ప్రతినిధులు, విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ కల్నల్, ప్రొఫెసర్ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.