విజ్ఞాన్స్ వర్సిటీ వీసీకు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్
చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్‌కు న్యూఢిల్లీలోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా – మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్‌ను మంగళవారం అందించింది. ఇందుకు సంబంధించిన సర్టిఫికెట్‌ను, గెజిట్ నోటిఫికేషన్‌ను ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ఎన్‌సీసీ డైరెక్టరేట్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎయిర్ కమోడర్ వీ. మధుసూదన్ రెడ్డి విజ్ఞాన్ యూనివర్సిటీకి విచ్చేసి వెస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్‌కు అందజేశారు . ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ – తెలంగాణ రాష్ట్రాల ఎన్‌సీసీ డైరెక్టరేట్ డెప్యూటీ డైరెక్టర్ జనరల్, ఎయిర్ కమోడర్ వీ. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ విజ్ఞాన్స్ యూనివర్సిటీ అకడమిక్ ఫ్రేమ్‌వర్క్‌లో ఎన్‌సీసీను ఏకీకృతం చేయడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచి విద్యార్థుల్లో క్రమశిక్షణ, స్నేహభావం, నిబద్ధత, సమగ్ర అభివృద్ధికై చేస్తున్నటువంటి కృషికి గాను ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్‌ను అందించామని వెల్లడించారు. యూనివర్సిటీలో ఎన్‌సీసీ కార్యకలాపాలను ఎక్కువగా నిర్వహించటంలో ఆయన విశేషమైన నిబద్ధతను ప్రదర్శించారని పేర్కొన్నారు. ఎన్‌సీసీ మరియు ఎన్‌సీసీయేతర క్యాడెట్‌లకు 20 క్రెడిట్‌లను అందించే ఎన్‌సీసీ మైనర్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం ఆయన సాధించిన విజయాలలో అతి ముఖ్యమైనదన్నారు. ఎన్‌సీసీ ట్రైనింగ్ ప్రాముఖ్యతను గుర్తిస్తూ అకడమిక్ కరిక్యులమ్‌లో ఇంటిగ్రేటెడ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఎస్‌ఎస్‌బీ ట్రై నింగ్‌ను ఎన్‌సీసీ మైనర్ కోర్సులో విలీనం చేసారని వెల్లడించారు. ఈయన నాయకత్వంలో కఠినమైన శిక్షణ, క్యాడెట్‌లలో క్రమశిక్షణ, స్నేహ భావాన్ని పెంపొందించడం కోసం విశ్వవిద్యాలయంలో క్యాంపుల నిర్వహణకు అనువైన వాతావరణం ఏర్పాటుకు కృషి చేశారని వెల్లడించారు. గడిచిన విద్యా సంవత్సరంలో ఇక్కడే రెండు శిబిరాలకు క్యాంపు స్థలాన్ని అందించడంలో ఆయన పాత్ర వెలకట్టలేనిదని తెలియజేసారు. రిపబ్లిక్ డే క్యాంప్, తలసైనిక్ క్యాంప్, ఆర్మీ అటాచ్‌మెంట్ క్యాంప్‌తో పాటు ఇతర జాతీయ స్థాయి పోటీలలో విద్యార్థులు చురుకుగా పాల్గొనేలా క్యాడెట్‌లను ప్రేరేపించడంలో వైస్ చాన్సలర్ కీలకపాత్ర పోషించారని వెల్లడించారు. ఈ క్యాంపుల వల్ల విద్యార్థుల్లో నైపుణ్యాలు పెరగడమే కాకుండా విజ్ఞాన్స్ యూనివర్సిటీకి మంచి గుర్తింపు వచ్చిందన్నారు. ఎన్‌సీసీ యూనిట్ల విశిష్టతను గుర్తించి యూనివర్శిటీ పరిధిలో కొత్త యూనిట్లను పెంచేందుకు కృషి చేశారని వెల్లడించారు. ఈ విస్తరణ పరిధిని పెంచడం వలన ఎక్కువ మంది విద్యార్థులు ఎన్‌సీసీలో చేరడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఎన్‌సీసీ కోర్సును యాడ్–ఆన్ డిప్లొమాగా ప్రవేశపెట్టారని తెలియజేసారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ ఎన్‌సీసీ విభాగంలో గౌరవ కల్నల్ ర్యాంక్ లభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ర్యాంక్ లభించడం వలన ఎన్‌సీసీ కార్యకలాపాలను నిర్వహించడంలో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. ఎన్‌సీసీ విద్యార్థులకు ఉపయోగపడేలా సరికొత్త ప్రోగ్రామ్‌లు డిజైన్ చేయటంతో పాటు మౌలిక వసతులు మెరుగుపరచడంలో మరింత కృషి చేస్తానన్నారు. గౌరవ కల్నల్ ర్యాంక్ సాధించిన విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్‌కు కల్నల్ సంజయ్ గుప్త, గుంటూరు గ్రూప్ కమాండర్ కల్నల్ ఎస్‌ఎం. చంద్రశేఖర్, ఇతర గ్రూప్ కమాండర్లు, బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్స్, విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.