నటన,దర్శకత్వం నాకు రెండు కళ్ళు
- సినీ, టీవీ, రంగస్థల నటి, దర్శకురాలు డా.శ్రీజ సాదినేని
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
నాటకరంగంలో బాలనటిగా అడుగుపెట్టి, వందల నాటకాలు , వేల ప్రదర్శనలు ఇస్తూ, కళా ప్రస్థానం కొనసాగిస్తూ, నటిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా అవార్డులు, రికార్డులు సాధించడం అదృష్టమని, ఇదంతా నటరాజు ఆశీర్వాదమని,
నటన, దర్శకత్వం నాకు రెండు కళ్ళు అని సినీ, నాటక నటి, రచయిత్రి, దర్శకురాలు డా.శ్రీజ సాదినేని అన్నారు.
డిసెంబర్ 30, సోమవారం నాడు తమ సొంత సంస్థ శ్రీ జయా ఆర్ట్స్ ఇరవై ఒకటవ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు శ్రీజ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ " నాటకరంగం మీద మమకారంతో 2003 డిసెంబర్ 30 న శ్రీ జయా ఆర్ట్స్ సాంస్కృతిక సంస్థను
స్థాపించి తన స్వీయ నిర్మాణ దర్శకత్వంలో 33 తెలుగు నాటిక, నాటకాలు రూపొందించిన శ్రీజ కళారంగ ప్రయాణంలో ఎదురైన సవాళ్ళను, సమస్యలను ఎంతో ధైర్యంగా అధిగమించి ఇప్పటి వరకూ రెండు వేల మందికి పైగా విద్యార్థులకు నటనలో శిక్షణ ఇచ్చి నాటక, టీవీ, సినీ రంగాలలో అవకాశాలు కల్పించినందుకు ఎంతో గర్వంగా ఉంది" అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆటుపోట్లను అధిగమించి అత్యంత క్రమశిక్షణతో సంస్థను నడిపించానని, నటనపట్ల ఆసక్తి కలిగిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చి వారితో నాటక ప్రదర్శనలు ఇప్పించానని ఆమె చెప్పారు. ఆడపిల్ల అనుకున్నది ఒంటరిగా సాధించాలి అంటే ఈ సమాజంలో ఎంత కష్టమో చిన్నతనం నుండి చూస్తున్నానని అయినా పోరాట పటిమ వదలకుండా నా సంస్థను ఈ స్థాయికి తీసుకుని వచ్చానని అన్నారు.
నిజమైన అభిమానంతో సహకరించిన శ్రీ జయా ఆర్ట్స్ సంస్థ సభ్యులకు శ్రీజ ధన్యవాదాలు తెలిపారు.
తనకు ఆదర్శంగా నిలిచిన గురువులకు, తనను తీర్చిదిద్దిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు, తన శిక్షణ ద్వారా ఎదిగి నాటక,సినీ,డబ్బింగ్ రంగాలలో కొనసాగుతున్న తన శిష్యులకు అభినందనలు తెలిపారు. ఇంతకాలం నాటక రంగానికి సేవలు అందించిన తాను ఈ నూతన సంవత్సరం నుండి సినీ రంగంలో రచయిత్రిగా, దర్శకురాలిగా అడుగులు వేయబోతున్నట్లు ఇప్పటి వరకూ 125 చిత్రాలకు అసోసియేట్ రైటర్ గా, 5 చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా, నాలుగు వందలకు పైగా చిత్రాలకు, ముప్ఫై వెబ్ సిరీస్ లకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసిన అనుభవంతో సినీ రంగంలో ముందడుగు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపిన శ్రీజ సాదినేని అందులో కూడా విజయం సాధిస్తాననే నమ్మకం , ఆత్మవిశ్వాసం ఉందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పలువురు సినీ, నాటక ప్రముఖులు శ్రీజ సాదినేనిని అభినందించారు.