ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం విద్యనే!
- హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీక్రిష్ణ దేవ రావ్
- సమాజానికి తిరిగి ఇవ్వాలి : విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
- ప్రపంచం ఎదురుచూస్తోంది : విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు
- విజ్ఞాన్స్ వర్సిటీలో ఘనంగా ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ 2వ స్నాతకోత్సవం
- 860 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేత : విజ్ఞాన్స్ వర్సీటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
టాలెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్:
ప్రపంచాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ఒక్క విద్యతోనే సాధ్యమని హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీక్రిష్ణ దేవ రావ్ అన్నారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో ఆన్‌లైన్ లెర్నింగ్, ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్‌లో ఎంసీఏ, ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులకు 2వ స్నాతకోత్సవాన్ని శనివారం వర్సిటీ ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీక్రిష్ణ దేవ రావ్ మాట్లాడుతూ దేశానికి నైపుణ్యమైన, జ్ఞానవంతమైన ప్రతిభను కలిగిన విద్యార్థులను అభివృద్ధి చేయడంలో విజ్ఞాన్స్ విశ్వవిద్యాలయం చేస్తున్న కృషి గర్వకారణమన్నారు. విద్య అనేది ఒక చిన్న జిజ్ఞాస లేదా లక్ష్యంతో మొదలై... జ్ఞానం, సామర్థ్యాల వంటి పెద్ద వృక్షంగా పెరుగుతుందన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లుగా ‘‘జ్ఞానం సృజనకు దారి తీస్తుంది. సృజన ఆలోచనకు దారి తీస్తుంది. ఆలోచన జ్ఞానానికి దారి తీస్తుంది. జ్ఞానం నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చుతుంది.’’ అదే విధంగా మీరు జ్ఞానం, నైపుణ్యాలను ఉపయోగించి సమాజానికి సేవ చేయాలన్నారు. మహాత్మా గాంధీ మరియు స్వామి వివేకానంద వంటి మహనీయులు నైతికత, నిజాయితీ ప్రాముఖ్యతను నిరూపించారు. మీరు కూడా చేసే ప్రతీ పనిలో ఉన్నత నైతిక ప్రమాణాలను పాటించాలని పిలుపునిచ్చారు. మీ విజయాన్ని కేవలం వ్యక్తిగత సాధనలతో కాకుండా సమాజంపై మీ ప్రభావంతో కొలవాలన్నారు. మీ విద్యను ఉపయోగించి అవసరమున్న వారికి సహాయం చేయాలని విద్యార్థులను కోరారు. మీరు పొందిన డిగ్రీ జీవితంలో ఒక మైలురాయి మాత్రమేనని, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి మీలో ఆసక్తి, ప్రేరణ నిరంతరం ఉండాలన్నారు. విజ్ఞాన్ విశ్వవిద్యాలయం మీకు అందించిన జ్ఞానం సమాజం మొత్తం అభివృద్ధికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు.
860 మంది విద్యార్థులకు డిగ్రీలు అందజేత : విజ్ఞాన్స్ వర్సీటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్
విజ్ఞాన్స్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ మాట్లాడుతూ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ 2వ స్నాతకోత్సవం సందర్భంగా తమ యూనివర్సిటీ 860 (ఎంబీఏ–670, ఎంసీఏ–190) మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేసామని తెలిపారు. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో మాత్రమే విద్యను అభ్యసించాలనే అవసరం లేదని, ‘ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరికైనా’ అనే ఆలోచనతో వచ్చిందే ‘డిస్టెన్స్ మరియు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‘ విధానమన్నారు. ఇది మానవాళిని విప్లవాత్మకంగా ఎదగడానికి కారణమవుతోందన్నారు. నిపుణులు మాత్రమే సమాజానికి ప్రగతిని అందించగలరు. ఈ నేపథ్యంలో విజ్ఞాన్స్ యూనివర్సిటీ తీసుకున్న డిస్టెన్స్ మరియు ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ప్రారంభానికి సంబంధించిన కృషి నిజంగా అభినందనీయమన్నారు. డిస్టెన్స్ విద్యార్థులు తమ త్యాగాలు, క్రమశిక్షణ, నిరంతర పట్టుదల. ఆత్మవిశ్వాసంతో ఈ లక్ష్యాన్ని సాధించగలిగారన్నారు. అవసరాల నడుమ వారు తమ సమయాన్ని విద్య కోసం కేటాయించి ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారని కొనియాడారు. వారి అనుభవాలు, వారు పొందిన కొత్త జ్ఞానం జీవితాన్ని మెరుగుపరచడంలో ఉపకరిస్తాయన్నారు. ఇది ‘ట్రాన్స్‌ఫర్ లెర్నింగ్‘ అనే భావనకు ఆధారంగా ఉంటుందన్నారు. మీరు సాధించిన విజయం మీ ఆత్మవిశ్వాసాన్ని, నిబద్ధతను ప్రతిబింబిస్తుందని.. ఎప్పుడూ మీ లక్ష్యాన్ని నమ్మి అది చేరే వరకు అవిశ్రాంతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
సమాజానికి తిరిగి ఇవ్వాలి : విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య
విద్య ఒక ప్రత్యేకాధికారం మాత్రమే కాకుండా సమాజానికి తిరిగి ఇవ్వాల్సిన బాధ్యతను కలిగి ఉందనే విషయాన్ని విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య గుర్తుచేశారు. ఎంబీఏ చదవడం ఎప్పుడూ సులభం కాదు. అటువంటిది ఆన్‌లైన్‌లో ఎంబీఏను చేయడమంటే మరింత నిబద్ధతను కోరుతుందన్నారు. పనులు, కుటుంబం, వ్యక్తిగత జీవితం మధ్య కఠినమైన విద్యా ఆవశ్యకతలను సంతులనం చేయడం చిన్న విషయం కాదన్నారు. మీ కృషి మీకు కేవలం ఒక అర్హతనే కాకుండా మీ నైపుణ్యాలను మెరుగుపరచడం, మీ వృత్తిపరమైన దృష్టికోణాన్ని మలుపు తిప్పడం జరుగుతుందన్నారు. ఈ డిగ్రీ మీకు కొత్త అవకాశాలను తెరవడం, నాయకత్వ భూమికలను చేపట్టడానికి శక్తినిచ్చే సాధనంగా ఉపయోగపడుతుందన్నారు. వ్యాపార ప్రపంచం టెక్నాలజీ, స్థిరత్వం, ఆవిష్కరణల ద్వారా ఎన్నడూ లేని వేగంతో అభివృద్ధి చెందుతోందన్నారు. అదేవిధంగా మీరందరూ స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు తోడ్పడటం ద్వారా సమాజానికి మేలు చేయడం పట్ల దృష్టి కేంద్రీకరించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయాణంలో మీకు మద్దతు అందించిన మీ కుటుంబసభ్యులకు, ఉపాధ్యాయులు, స్నేహితులకు కృతజ్ఞతలు తెలపాలన్నారు.
ప్రపంచం ఎదురుచూస్తోంది : విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు
జీవితంలో సవాళ్లు వస్తాయి... కానీ వాటిని అవకాశాలుగా చూడండి. నైతిక విలువలతో ముందుకు సాగండి. మీరు సృష్టించే మార్గం కోసం ప్రపంచం ఎదురుచూస్తోంది. మీ నడతతో దాన్ని కొత్త పుంతలు తొక్కించండని విజ్ఞాన్స్ విద్యాసంస్థల వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. వ్యక్తిగత జీవితంలో వివధ రకాల బాధ్యతలు, ప్రతికూలతలను ఎదుర్కొంటూనే ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సును పూర్తి చేయడంలో మీరు చూపిన అచంచలమైన నిర్ణయం మరియు కట్టుబాటుకు అభినందనలు తెలియజేశారు. ఈ ప్రయాణంలో మీరు కేవలం మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు మారుతూ ఉండే ప్రపంచంలో నాయకులుగా ఎదగడానికి అవసరమైన మనోధైర్యాన్ని మరియు స్వభావాన్ని కూడా అభివృద్ధి చేసుకున్నారని కొనియాడారు. విద్య అనేది కేవలం సూత్రాలను మాత్రమే కాకుండా మనుషులను అర్థం చేసుకోవడం, సవాళ్లను ఎదుర్కోవడం, సమాజానికి పరిష్కారాలను సృష్టించడం గురించి కూడా ఉంటుందన్నారు. మీరు ఎల్లప్పుడూ నీతి, నిజాయితీ, సమగ్రతలను పాటిస్తూ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలో పైకి ఎదగాలని ఆకాంక్షించారు. విజయానికి డబ్బు వెంట పరుగెత్తడమే మంచిదంటూ ఒక సామాన్య భావన ఉంది. కానీ అది నిజానికి విరుద్ధమని, రతన్ టాటాయే ఈ విషయానికి గొప్ప ఉదాహరణని తెలియజేసారు. ఆయన సంపదను సమాజానికి అందజేస్తూనే తన సూత్రాలను ఎప్పుడూ తాకట్టు పెట్టలేదన్నారు. రతన్ టాటా కేవలం ప్రసిద్ధ పారిశ్రామికవేత్త మాత్రమే కాదని... అతని వినయం, మనోధైర్యం, లక్ష్యంతో నడిచే నాయకత్వానికి నిజమైన ప్రాతినిధ్యమన్నారు. టాటా స్టీల్‌లో చిన్న కార్మికుడిగా పని ప్రారంభించిన రతన్ టాటా, ప్రతిభను, కృషిని నమ్ముకుని ఉన్నత స్థానాలకు ఎదిగారన్నారు. టాటా గ్రూప్‌ను గ్లోబల్ పవర్‌హౌస్‌గా మార్చడంలో ఆయన తీసుకున్న నిర్ణయాలు, మన దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఆర్థిక విజయాలను దాటి, ఆయన సామాజిక సేవకు చూపిన నిబద్ధత ప్రత్యేకమని కొనియాడారు. తక్కువ ధరల్లో రవాణా కోసం టాటా నానో, శుభ్రమైన త్రాగునీటికి టాటా స్వచ్, విద్య, ఆరోగ్యం, విపత్తుల సహాయం వంటి రంగాల్లో ఆయన చేసిన దాతృత్వం అసమానమైనవని కొనియాడారు. ప్రియమైన పట్టభద్రులారా.... మీరు ఇప్పుడు వృత్తి ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నారు. రతన్ టాటా గారి నుండి స్ఫూర్తి పొందండి. మీ డిగ్రీ ఒక అర్హత మాత్రమే కాదు. ఇది ఒక బాధ్యత. మీ విశ్లేషణాత్మక నైపుణ్యాలు, వ్యూహాత్మక ఆలోచన మరియు సృజనాత్మకతను ఉపయోగించి సమాజంపై మంచి ప్రభావం చూపండి. మీ నిర్ణయాలకు కరుణ మరియు సమగ్రత మార్గదర్శకంగా ఉండాలని పిలుపునిచ్చారు.
అంబరాన్నింటిన సంబరం
డిగ్రీలు చేతబట్టుకున్న వేళ విద్యార్థుల సంబరం అంబరాన్ని అంటింది. కేరింతలతో వర్సిటీ ప్రాంగణమంతా హోరెత్తిపోయింది. విద్యార్థులంరూ గుర్తుగా సెల్ఫీలు దిగారు. దేశాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ప్రతిన బూనారు. విద్యార్థులంతా తలపాగా, కండువా వేసుకుని అచ్చతెలుగు సంప్రదాయాన్ని ప్రదర్శించారు. సంస్కృతీ సంప్రదాయాలు ప్రతిబింబిస్తూనే సాంకేతిక విద్యా సర్టిఫికెట్లను పొందారు.
కార్యక్రమంలో హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీక్రిష్ణ దేవ రావ్, విజ్ఞాన్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, వైస్ చైర్మన్ లావు శ్రీకృష్ణదేవరాయలు, వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ పీ.నాగభూషణ్ , రిజిస్ట్రార్ డాక్టర్ ఎంఎస్ రఘునాథన్, బోర్డు ఆఫ్ మేనేజిమెంట్ సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు, అకడమిక్ కౌన్సిల్, ఆయా విభాగాల డీన్లు, సీడీఓఈ డైరక్లర్లు, స్నాతకోత్సవ కన్వీనర్లు, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.