28న బి.ఎల్. నారాయణకు తుమ్మల స్మారక సాహితీ పురస్కారం
పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు బి.ఎల్. నారాయణకు కామ్రేడ్ తుమ్మల వెంకట్రామయ్య స్మారక సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు అభ్యుదయ రచయితల సంఘం గుంటురు జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కనపర్తి బెన్హెర్బాబు ప్రకటించారు. స్థానిక గాంధీనగర్లోని సిపీఐ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం జరిగిన విలేకర్ల సమావేశంలో బెన్హర్ మాట్లాడుతూ ఈ నెల 28 మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు గాంధీనగర్ లోని కవిరాజు పార్కులోని శ్రీ వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక సీనియర్ సిటిజన్ భవనంలో జరిగే కార్యక్రమంలో అఖిల భారత అరసం అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ, సినీ మాటల రచయిత డాక్టర్ సాయిమాధవ్ బుర్రా, ప్రవాసభారతీయుడు, ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బాబు ఆర్. వడ్లమూడి, అరసం రాష్ట్ర కార్యదర్శి వల్లూరు శివప్రసాద్ చేతులమీదుగా ఈ పురస్కారాన్ని బి. ఎల్. నారాయణకు అందిస్తున్నట్లు బెన్హర్ తెలిపారు. విలేకర్ల సమావేశంలో పాల్గొన్న ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్, బాలసాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జాని మాట్లాడుతూ మూడున్నర దశాబ్దాలుగా పత్రికారంగానికి ఎనలేని సేవలు అందించిన బి.ఎస్. నారాయణకు కామ్రేడ్ తుమ్మల సాహితీ పురస్కారాని ప్రకటించడం హర్షనీయమన్నారు. పాత్రికేయునిగానే కాక రచయితగా దివంగత ప్రముఖులపై 'జయహో మన తెనాలి', 'చరితార్థులు'తోపాటు అనేక పుస్తకాలను బి.ఎల్. రచించారు. గతంలో బి.ఎల్. నారాయణ కాళోజీ నారాయణ, వావిలాల గోపాలకృష్ణయ్య వంటి మహోన్నతులు అందుకున్న ప్రతిష్టాత్మకమైన గాడిచర్ల హరిసర్వోత్తమరావు పురస్కారాన్ని, పిల్లలమర్రి రాధాదేవి స్మారక రాష్ట్ర ఉత్తమ గ్రామీణ విలేకరి పురస్కారం, నార్ల వెంకటేశ్వరరావు-దేవినేని పురస్కారం, ప్రముఖ పాత్రికేయుడు జీఎల్ఎస్ గాంధీ స్మారక అవార్డులు అందుకున్నారని హకీం జాని తెలిపారు. నేపథ్యంలో పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. విలేకర్ల సమావేశంలో అరసం గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ, బుర్రా నరసింహ, ఆకుల శ్రీనివాసరావు, వి. వెంకటేశ్వరరావు, కె. నాగయ్య తదితరులు పాల్గొన్నారు.